ఇరాన్ మ‌హిళ‌లు అక్క‌డికెళ్ల‌డం అస‌భ్య‌తంట‌..?! ఇదేమి తంట‌? (వీడియో)

స‌మాన‌త్వాన్ని వ్య‌తిరేకించే ఏ సిద్ధాంత‌మైన అహంకారం నుంచి పుట్టిందే. Iran blocked women from attending football match.

Update: 2022-03-31 12:53 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః స్త్రీలు వ్య‌క్తిగ‌త ఆస్తిలా మారిన కాలం నుంచి ప్ర‌పంచంలో స్త్రీలు అన్ని రంగాల‌కు ఎగ‌బాకిన ఇప్ప‌టి అత్యాధునిక యుగం వ‌ర‌కూ మ‌హిళ‌ల‌పైన ఏదో ఒక రూపంలో ఆంక్ష‌ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. స‌మాన‌త్వాన్ని వ్య‌తిరేకించేది ఏ సిద్ధాంత‌మైన అది అధికారపు అహంకారం నుంచి పుట్టిందే. మ‌హిళ వంట‌గ‌దిలోనే ఉండాల‌న్నమొన్న‌టి స‌నాత‌న సంస్కృతి అయినా, తాలీబాన్ పాల‌న‌లోకి నెట్ట‌బ‌డిన ఆఫ్ఘ‌నిస్థాన్ అయినా, మ‌హిళ‌లు ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి వెళ్ల‌డం అస‌భ్య‌త అన్న ఈనాటి ఇరాన్ అయినా... అన్ని చోట్లా ఇదే 'అధికారం' స్త్రీని అణ‌గ‌దొక్కుతూనే ఉంది. ఇందులో భాగంగానే మార్చి 29న మషాద్‌లోని ఇమామ్ రెజా ఫుట్‌బాల్ స్టేడియంలోకి ప్రవేశించకుండా అనేక మంది ఇరానియన్ మహిళలను ఇరాన్ అధికారులు అడ్డుకున్నారు. అయితే, దీనిపై ఆ దేశంలో తీవ్ర నిర‌స‌నలు వెల్లువెత్తాయి. వివక్షతతో కూడిన స్టేడియం నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ఫీఫా ఇరాన్ ప్రభుత్వంతో సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని డిమాండ్ పెరిగింది.

ఫీఫా వరల్డ్ కప్ ఖతార్-2022 కోసం ఇరాన్, లెబనాన్ మ‌ధ్య క్వాలిఫికేషన్ మ్యాచ్ జ‌రిగింది. అయితే, మ్యాచ్‌ను చూడ‌టానికి వ‌చ్చిన‌ మహిళల్ని స్పోర్ట్స్ స్టేడియంలోకి రాకుండా నిషేధించింది ప్ర‌భుత్వం. అప్పటికే 2 వేల మంది మ‌హిళ‌లు టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయినా, మ‌హిళ‌లు స్టేడియంలో ఉండ‌టం స‌భ్య‌త కాదంటూ పితృస్వామ్య భావ‌జాలం క‌ఠినంగా అడ్డుకుంది. స్టేడియం ద‌గ్గ‌ర నిర‌స‌న తెలుపుతున్న మహిళ‌ల‌పై పెప్ప‌ర్ స్ప్రే ఉప‌యోగించింది. అయితే, స్టేడియం వ‌ద్ద ఇరాన్‌ మ‌హిళ‌లు చేస్తున్న నిర‌స‌న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.


ఈ మ్యాచ్‌లో ఇరాన్ 2-0తో లెబనాన్‌ను ఓడించిన‌ప్ప‌టికీ, ఇరాన్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌డంలో దారుణంగా ఓడిపోయింది. మషాద్‌లో జరిగే మ్యాచ్‌కు మహిళా సాకర్ మద్దతుదారులను హాజరుకాకుండా నిషేధించే నిర్ణయానికి ప్రతిస్పందనగా, సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోల్లో వందలాది మంది మహిళా సాకర్ అభిమానులు "మాకు అభ్యంతరం ఉంది" అని అరిచారు. అయితే, మ్యాచ్‌కు హాజరుకాకుండా మహిళలను అడ్డుకునే నిర్ణయం ఎవరు తీసుకున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇక‌, 1979 ఇస్లామిక్ విప్లవం నుండి, ఇరాన్‌లో పురుషుల ఆటలు, ఇతర క్రీడా కార్యకలాపాలకు హాజరుకాకుండా మహిళల్ని నిషేధిస్తున్నారు. దీనిపై అంత‌ర్జాతీయంగానూ వ్య‌తిరేక‌త క‌నిపిస్తుంది.

Tags:    

Similar News