కెనడాలో భారత మహిళ మృతి
కెనడా హాలిఫాక్స్ నగరంలో 19 ఏళ్ల సిక్కు యువతి విగత జీవై కనిపించింది. హాలిఫాక్స్ మంఫర్డ్ రోడ్డులోని వాల్‌మార్ట్‌కు చెందిన బేకరీ డిపార్ట్‌మెంట్‌లోని వాక్ ఇన్ ఓవెన్‌లో యువతి డెడ్ బాడీ కనిపించింది.
దిశ, నేషనల్ బ్యూరో: కెనడా హాలిఫాక్స్ నగరంలో 19 ఏళ్ల సిక్కు యువతి విగత జీవై కనిపించింది. హాలిఫాక్స్ మంఫర్డ్ రోడ్డులోని వాల్‌మార్ట్‌కు చెందిన బేకరీ డిపార్ట్‌మెంట్‌లోని వాక్ ఇన్ ఓవెన్‌లో యువతి డెడ్ బాడీ కనిపించింది. అదే వాల్‌మార్ట్‌లో పని చేస్తున్నట్టు చెబుతున్న ఆ యువతి వ్యక్తిగత వివరాలను ఇంకా అధికారులు గుర్తించలేదు. ఇటీవలే ఆమె భారత్ నుంచి కెనడాకు వచ్చిందని మారిటైమ్ సిక్ సొసైటీ ధ్రువీకరించింది.
మంఫర్డ్ రోడ్డులోని వాల్‌మార్ట్ నుంచి శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తమకు ఈ ఘటనకు సంబంధించి ఫోన్ కాల్ వచ్చిందని హాలిఫాక్స్ రీజినల్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేవని వివరించారు. ఆమె కుటుంబం, మిత్రులను దృష్టిలో పెట్టుకుని ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం గానీ, ఆ ప్రచారాన్ని వాస్తవమని విశ్వసించడం గానీ చేయరాదని విజ్ఞప్తి చేశారు. మారిటైమ్ సిక్ సొసైటీ ప్రతినిధి అన్మోల్ ప్రీత్ సింగ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఆమె ఉన్నత భవిష్యత్ కోసం ఇటీవలే భారత్ నుంచి కెనడాకు వచ్చారని, ఆమె మృతి చెందడం బాధాకరమని తెలిపారు.