UK: ప్రవాసులు అలర్ట్.. గొడవలు జరిగే ప్రాంతాలకు వెళ్లొద్దు: భారత ఎంబసీ
ఇటీవల కాలంలో యూకేలో తరుచుగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కాలంలో యూకేలో తరుచుగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అవి మరింత తీవ్రతరం కావడంతో అప్రమత్తమైన లండన్‌లోని భారత హైకమిషన్ మంగళవారం భారత పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రవాసులు గొడవలు జరిగే ప్రాంతాలకు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో అడ్వైజరీని జారీ చేసింది, యూకేలో కొన్ని ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుంది. లండన్‌లోని భారత హైకమిషన్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారతీయులు యూకేలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, స్థానిక భద్రతా సంస్థలు జారీ చేసే ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి, అలాగే గొడవలు జరిగే ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. ఏవైనా ఇబ్బందులు కలిగితే ప్రవాసులు వెంటనే కమిషన్‌ను సంప్రదించాలని ఎక్స్‌లో పేర్కొంది.
ఇటీవల ఒక డ్యాన్స్ క్లాస్‌లో ముగ్గురు పిల్లలపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేయడంతో వారు చనిపోయారు. దీంతో నిందితులకు వ్యతిరేకంగా ప్రారంభించిన నిరసనలు కాస్త వలస వ్యతిరేక ఆందోళనకు దారితీసింది. ఆ తరువాత ఈ అల్లర్లు లివర్‌పూల్, మాంచెస్టర్, లీడ్స్ వంటి ప్రధాన నగరాలతో పాటు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఆందోళనకారులు తమ నిరసనలు మరింత తీవ్రతరం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగగా, వారి మధ్య ఘర్షణలకు దారితీసింది. శనివారం ఇంగ్లండ్, ఉత్తర ఐర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు పెరిగి హింసాత్మకంగా మారడంతో, యూకే పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు.