US: హిందూ ఆలయం గోడలపై అభ్యంతరకర వ్యాఖ్యలపై భారత్ రియాక్ట్

అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో బాప్స్‌ శ్రీ స్వామినారాయణ మందిరం గోడలపై అభ్యంతరకర వ్యాఖ్యలు రాసిన ఘటనను భారత్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది

Update: 2024-09-27 06:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో బాప్స్‌ శ్రీ స్వామినారాయణ మందిరం గోడలపై అభ్యంతరకర వ్యాఖ్యలు రాసిన ఘటనను భారత్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అక్కడి స్థానిక అధికారులను డిమాండ్ చేసింది. ఈ మేరకు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో వ్యాఖ్యానిస్తూ, BAPS శ్రీ స్వామినారాయణ మందిరంలో సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి జరిగిన విధ్వంసక చర్యను తీవ్రంగా ఖండిస్తోంది. స్థానిక అధికారులు దీని గురించి చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ ఘటన విషయానికి వస్తే, దుండగులు హిందువుల పవిత్ర దేవాలయం అయినటువంటి స్వామినారాయణ మందిరం గోడలపై “హిందువులు గో బ్యాక్!” అనే నినాదాన్ని రాశారు. అంతటితో ఆగకుండా ఆలయానికి వెళ్లే నీటి పైపుల్ని సైతం ధ్వంసం చేశారు. ఈ విషయం గురించి తెలిసిన భారతీయ అమెరికన్లు ఆలయం వద్దకు చేరుకొని, శాంతి కోసం అక్కడ జరిగిన ప్రార్థనల్లో భారీగా పాల్గొన్నారు. ఈ ఘటనపై హిందూ అమెరికన్ చట్టసభ సభ్యులు స్పందించారు. బాధ్యులను కనిపెట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటీవల తరుచుగా హిందూ ఆలయాల గోడలపై విద్వేషపూరిత రాతలు రాసిన ఘటనలు చోటుచేసుకుంటుండగా, వీటిని భారత్ సీరియస్‌గా తీసుకుంది.


Similar News