India Bangladesh: షేక్ హసీనాను వెంటనే అప్పగించాలి.. బీఎన్పీ నేత మీర్జా ఫక్రుల్ ఇస్లాం

ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలకు షేక్ హసీనా అప్పగింత ఎంతో కీలకమని బీఎన్పీ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ అన్నారు.

Update: 2024-08-31 17:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలకు షేక్ హసీనా అప్పగింత ఎంతో కీలకమని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ అన్నారు. హసీనా భారత్‌లో కొనసాగడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ఇదు దేశాల మధ్య కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం చాలా ముఖ్యమని, షేక్ హసీనా అప్పగింతతో అది ప్రారంభమవుతుందని చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత విభేదాలను అధిగమించి భారత్‌తో సహకరించడానికి బీఎన్పీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బంగ్లాదేశ్‌లో భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి కార్యకలాపాలనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.

బీఎన్పీ అధికారంలోకి వస్తే, అవామీ లీగ్ హయాంలో సంతకం చేసిన అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత అంతర్గత విషయమని నొక్కిచెప్పారు.హిందువులపై దాడులు జరుగుతున్నట్టు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. ఎందుకంటే చాలా సంఘటనలు మతపరంగా కాకుండా రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని తెలిపారు. హసీనాను వెంటనే అప్పగించాలని, ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి రావడాన్ని భారత్ నిర్ధారించకపోతే, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత దిగజారిపోతాయని అభిప్రాయపడ్డారు.  


Similar News