Morocco Earthquake: మొరాకోలో భారీ భూకంపం.. 820 మంది మృతి

మొరాకోను భూకంపం కుదిపేసింది.

Update: 2023-09-09 12:41 GMT

రబత్: మొరాకోను భూకంపం కుదిపేసింది. శుక్రవారం రాత్రి 11:11 గంటల సమయంలో ప్రజలు గాఢనిద్రలో ఉండగా చోటు చేసుకున్న ఈ భూవిలయంలో 820 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 329 మంది గాయపడగా, వారిలో 51 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈవివరాలను మొరాకో హోం శాఖ వెల్లడించింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. ప్రముఖ పర్యాటక నగరం మరకేశ్‌‌కు 71 కి.మీ దూరంలో ఉన్న హై అట్లాస్ పర్వతాల్లో 18.5 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. దేశంలోని మూడో వంతు ప్రాంతం భూకంపానికి ప్రభావితమైందని తెలిపింది.

దేశంలోని అల్ హఉజ్, మరకేశ్, ఉరాజాజాతె, అజీలాల్, చీచావువా, టారౌడంట్ మున్సిపాలటీలలో ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించాయని మొరాకో హోం శాఖ చెప్పింది. మరకేశ్‌‌లోని మెదినాలో పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోయాయని పేర్కొంది. ప్రభావిత ప్రాంతాల్లోని శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండి పోతుండటంతో, రక్తదానం చేయాలని దేశ ప్రజలకు మొరాకో ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ప్రధాని మోడీ సంతాపం..

జీ20 సదస్సు ప్రారంభించడానికి ముందు.. మొరాకో భూకంపంలో చనిపోయిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు. మొరాకో దేశానికి బాసటగా దేశాలన్ని ఉన్నాయని అన్నారు. ఈ ప్రకృతి విపత్తులో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు అవసరమైన సాయమంతా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.


Similar News