Israel-Hezbollah: ఇజ్రాయెల్‌పై 50కి పైగా రాకెట్లను ప్రయోగించిన హిజ్బుల్లా

హమాస్ చీఫ్ హనియా హత్యతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2024-08-04 04:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ చీఫ్ హనియా హత్యతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ కీలక నేతలను ఇజ్రాయెల్‌ అంతమొందించడంతో రగిలిపోతున్న ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్ పైకి 50 కి పైగా రాకెట్లను ప్రయోగించింది. బీట్ హిల్లెల్ పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర ఇజ్రాయెల్‌పైకి కత్యుషా రాకెట్‌ల బారేజీని పేల్చినట్లు హిజ్బుల్లా ఆదివారం ప్రకటించింది. అయితే రాకెట్లలో చాలా వాటిని ఇజ్రాయెల్‌ ఎయిర్ డిఫెన్స్ సిస్టం గాల్లోనే పేల్చేసిందని సమాచారం. లెబనాన్‌లోని క్ఫర్ కేలా, డెయిర్ సిరియాన్‌లపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా, గాయపడిన పౌరులకు సంఘీభావంగా దాడులు చేశామని హిజ్బుల్లా పేర్కొంది.

గత మంగళవారం హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే ఇరాన్‌లో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఇజ్రాయెల్‌ కారణమని ఇరాన్, హమాస్ ఆరోపించాయి. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్‌ అగ్ర నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా ప్రతీకారంగా దాడులు చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి జరిగే ముప్పు పొంచి ఉందని ఇప్పటికే సమాచారం అందింది. ఈసారి సైనిక స్థావరాలు కాకుండా పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఇప్పుడు డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించింది. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మరింత తీవ్రం అవుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు క్షీణిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత్‌ హెచ్చరించింది. లెబనాన్‌కు వెళ్లవద్దని సూచించింది.

Tags:    

Similar News