సహారా ఎడారిలో భారీ వర్షాలు, వరదలు..! ముంచుకొస్తున్న ముప్పుకు సంకేతమా?

ప్రపంచంలో వైశాల్యంలోనే అతి పెద్ద ఎడారి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా పేరొందిన సహారా ఎడారిలో భారీ వర్షాలు, వరదలు సంభవించడం మానవాళిని, పర్యావరణ వేత్తలను, శాస్త్రజ్ఞులను కలవర పెడుతుంది.

Update: 2024-10-15 10:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో వైశాల్యంలోనే అతి పెద్ద ఎడారి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా పేరొందిన సహారా ఎడారిలో భారీ వర్షాలు, వరదలు సంభవించడం మానవాళిని, పర్యావరణ వేత్తలను, శాస్త్రజ్ఞులను కలవర పెడుతుంది. ఏడాది మొత్తంగా సగటున 5 మి.మీ వర్షపాతం కూడా నమోదుకాని ఈ ఎడారిలో విచిత్రంగా భారీ వర్షాలు సంభవించడమే కాకుండా వరదలు సంభవించే స్థాయిలో వర్షపాతం నమోదు కావడం వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనను భూగోళంపై సంభవించే మరిన్ని భారీ విపత్తులకు సంకేతంగా వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో అనేక దేశాల్లో విస్తరించిన సహారా ఎడారి భూగోళంపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా పేరుగాంచింది. బలమైన గాలులు, పూర్తిగా పొడిబారిన వాతావరణం కల్గిన ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. సాధరణంగా ఏడాది మొత్తమ్మీద 5 మి.మీ లేదా అంతకంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి అసలేమాత్రం వర్షం కూడా ఉండదు. అందుకే మానవ ఆవాసానికి అత్యంత కష్టతరమైన ప్రాంతంగా సహారా ఎడారి రికార్డుల్లో నిలిచింది. అలాంటి సహారా ఎడారిలో సరిగ్గా 50 ఏళ్ల క్రితం (1974లో) ఒకసారి ఇలాగా ఆరేళ్ల కరవు తర్వాత భారీ వర్షాలు కురిసాయి. అప్పుడు కూడా వరదలు సంభవించాయి. ఈ తరహా మార్పులు అప్పుడప్పుడూ సంభవించడం సహజమే. అయితే మానవ తప్పిదాలు ఈ మార్పుల తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 7, 8 తేదీల్లో ఎక్స్‌ట్రా ట్రాపికల్ సైక్లోన్ పరిస్థితి ఏర్పడింది. దీన్ని వాతావరణ శాస్త్రవేత్తలు తుఫానుగా పరిగణించరు. కానీ ఇది భారీ వర్షపాతానికి కారణమైంది. కేవలం రెండ్రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలతో ఈ ఏడారిలో కొన్ని ప్రాంతాలు నీట ముంపునకు గురికావాల్సి వచ్చింది. నాసా శాటిలైట్ల ద్వారా పరిశీలిస్తే ఎడారి ఇసుక తెన్నెల మీదుగా నీటి ప్రవాహం స్పష్టంగా కనిపించింది. మొరాకో దేశంలోని ఇరికి సరస్సు 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ వర్షంతో పూర్తిగా నిండిపోయింది.

ఎడారిలో ఎందుకీ మార్పులు ?

సహారా ఎడారిలో సంభవించిన భారీ వర్షాలకు ఇంటర్‌ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ కారణమని మరికొందరు శాస్త్రవేత్తలుఅంచనా వేస్తున్నారు. భూగోళాన్ని భూమధ్య రేఖ రెండుగా విభజిస్తుండగా.. దానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఉత్తారార్థ గోళంగా, దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని దక్షిణార్థ గోళంగా పేర్కొంటాం. ఈ రెండు ప్రాంతాల మీదుగా వచ్చే గాలులు భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో కలిసి తుఫాను తరహా పరిస్థితులు సృష్టిస్తున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనాల ప్రకారం ఈ జోన్ కాస్త ఉత్తర దిశగా జరిగి సహారా ఎడారి ఉత్తర ప్రాంతంలో వర్షాలకు ఊతమిచ్చిందని భావిస్తున్నారు. ఇంకొందరు శాస్త్రవేత్తలు మాత్రం అట్లాంటిక్ మహాసముద్రంలోని ఉత్తర భాగంలో జలాలతో పాటు మధ్యధరా సముద్రంలోని జలాలు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కడం కారణంగానే సహారా ఎడారిలో వర్షాలు సంభవించాయని చెబుతున్నారు. ఈ జలాలు వేడెక్కడానికి వాతావరణంలో కాలుష్యం స్థాయులు పెరిగి భూతాపం పెరగడం వల్లనేనని, ఇది మానవ తప్పిదాల వల్లనే జరిగిందని సూత్రీకరిస్తున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే ఘటనలు మరిన్ని చోటుచేసుకుంటాయని కూడా వారు అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను నమోదు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సహారా ఎడారిలో ఇలాంటి తీవ్ర వాతావరణ మార్పులన్నీ వేసవి సమయంలోనే నమోదయ్యాయని వారు గుర్తుచేస్తున్నారు.

కదులుతున్న అకాశ నదులు

మరికొన్ని అధ్యయనాల ప్రకారంభూ ఉపరితల వాతావరణంలో ఆకాశ నదులుగా అభివర్ణించే సన్నని పొడవైన నీటి పొరలు తరుచూ వర్షాలు, తుఫాన్లకు కారణమవుతుంటాయి. ఈ ఆకాశ నదుల్లో మార్పుల కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వరుస వర్షాభావ పరిస్థితులు, కరవు సంభవిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఈ ఉపరితల నదులు ఉత్తర దిశగా కదిలి ఆర్కిటిక్ ప్రాంతానికి చేరుకుంటే.. అక్కడి మంచు కూడా కరిగిపోయి భూగోళం అంతటా అనూహ్య వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి అధ్యయన ఫలితాలను ‘అలాస్కా బీకాన్’ అనే సైన్స్ మ్యాగజైన్‌లో ప్రచురించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించిన పరిశోధనా పత్రాల ప్రకారం ఆకాశ నదులు ఉత్తర ధృవం దిశగా 6 నుంచి 10 డిగ్రీల మేర జరిగాయి. గత నాలుగు దశాబ్దాల్లో జరిగిన మార్పు ఇదని, ఈ ప్రభావంతో కారణంగా ఉత్తర అమెరికా, అలాస్కా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఈ నివేదిక చెబుతోంది. మొత్తమ్మీద భూగోళంపై వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల వైపరీత్యాల్లోనూ తీవ్రమైన మార్పులు చోటుచేసుకుని నీటి ఎద్దడి ఓవైపు, వరదలు మరోవైపు మానవాళిని సమస్యలు సృష్టిస్తాయంటున్నారు నిపుణులు. 

https://x.com/Chipropro/status/1844285855789351248


Similar News