రెడ్ ​నోటీస్​ ఓకే.. మరి బ్లూ ఏంటి..? ఇంటర్ పోల్ నోటీసుల పూర్తి వివరాలు ఇవే

ఫోన్ ​ట్యాపింగ్ ​కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావుపై ఇంటర్ ​పోల్ ​రెడ్ ​కార్నర్, బ్లూ నోటీస్​ జారీ చేసింది.

Update: 2024-06-11 14:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ​ట్యాపింగ్ ​కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్​ ప్రభాకర్​రావుపై ఇంటర్ ​పోల్ ​రెడ్ ​కార్నర్, బ్లూ నోటీస్​ జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్​రావు అమెరికాలో తలదాచుకోవడంతో ప్రభుత్వం ఇంటర్​పోల్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే, రెడ్​కార్నర్ నోటీసు అంటే తెలుసు కానీ, మరి బ్లూ నోటీస్ ఏంటి? ఇంతకీ ఇంటర్​పోల్​అంటే ఏమిటో ఒకసారి చూద్దామా..?

ఇంటర్నేషన్ ​క్రిమినల్​ పోలీస్ ఆర్గనైజేషన్​

విదేశాలకు పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు వివిధ దేశాల అభ్యర్థనల మేరకు ఇంటర్​పోల్ సంస్థ పలు నోటీసులు జారీ చేస్తుంది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే ఈ సంస్థలో 196 సభ్యదేశాలు ఉన్నాయి. ఇంటర్నేషన్​క్రిమినల్​పోలీస్​ఆర్గనైజేషన్‌ను షార్ట్​ఫార్మ్‌లో ఇంటర్​పోల్​అని పిలుస్తారు. రకరకాల నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన నేరస్తులను తిరిగి దేశానికి రప్పించేందుకు సభ్యదేశాలు ఈ సంస్థ సహాయం తీసుకుంటాయి. ఆయా నేరాల తీవ్రతను బట్టి ఇంటర్​పోల్ రంగులు కేటాయించింది. నిందితులపై ఆ రంగు పేరిట నోటీసు జారీ చేస్తారు. చాలామందికి రెడ్​కార్నర్​నోటీసు తెలుసు. కానీ, ఇందులో మరికొన్ని రంగులు కూడా ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

రంగులు.. నోటీసులు

రెడ్ నోటీస్: స్వదేశం కానీ ఏదైనా దేశంలో నేరం చేసి మరో దేశానికి పారిపోయిన వ్యక్తులపై ఈ నోటీస్ జారీ చేస్తారు. తలదాచుకున్న దేశం అతడిని అరెస్ట్​చేసి ఇంటర్​పోల్​మార్గదర్శకాలకు అనుగుణంగా నేరం చేసిన దేశానికి అప్పగించాల్సి ఉంటుంది.

ఎల్లో నోటీస్: పిల్లలు కానీ, గల్లంతైన వ్యక్తులను వెతకడం.. తప్పిపోయిన వ్యక్తులకు విషయంలో ఈ నోటీసు జారీ చేస్తారు.

బ్లూ నోటీస్: ఏదైనా దేశం ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని కోరినప్పుడు ఈ నోటీస్ జారీ చేస్తారు. సదరు వ్యక్తి దాగి ఉన్న చిరునామాతో పాటు అక్కడ చేస్తున్న పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

బ్లాక్ ​నోటీస్: గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన సమాచారం కోరేందుకు ఈ నోటీస్​జారీ చేస్తారు.

గ్రీన్ ​నోటీస్: నేరచరిత్ర ఉన్న వ్యక్తి గురించి ముందస్తుగా సమాచారం ఇచ్చేందుకు ఈ నోటీస్​ఇస్తారు. ప్రజల ప్రాణాలకు అతడు ముప్పుగా మారే ప్రమాదం ఉన్న సందర్భంలో దీనిని వినియోగిస్తారు.

ఆరెంజ్​నోటీస్: ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారేందుకు అవకాశం ఉన్న వేడుకలు గానీ, వ్యక్తులు, వస్తువులు ఏదైనా దేశంలోకి ప్రవేశించినప్పుడు ఈ నోటీస్​జారీ చేస్తారు. తక్షణమే ఆ వేడుకలు నిలిపివేయాలని, అతడు లేదా వస్తువును అదుపులోకి తీసుకోవాలని హెచ్చరించేందుకు వాడతారు.

పర్పుల్​నోటీస్: నేరం చేసే తీరు (మోడస్ ఆపరాండీ), ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రమాదకర వస్తువుల గురించిన సమాచారాన్ని అందించే సమయాల్లో ఈ నోటీస్​ ఇష్యూ చేస్తారు.

 


Similar News