ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి వరదలు..16 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బగ్లాన్, బదక్షన్ ప్రావిన్సుల్లో వరదల కారణంగా 16 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బగ్లాన్, బదక్షన్ ప్రావిన్సుల్లో వరదల కారణంగా 16 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. సుమారు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్టు వెల్లడించారు. దండ్-ఎ-ఘోరీ, దోషి, పుల్-ఎ-ఖుమ్రీ నగరం, సెంట్రల్ బదక్షన్‌లోని మోర్చక్ గ్రామంతో సహా అనేక ఇతర ప్రాంతాలపై వరదలు ప్రభావం చూపినట్టు తెలిపారు. బదక్షన్‌లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందగా..మరొకరు గాయపడ్డట్టు ప్రకృతి విపత్తు నిర్వహణ అధిపతి మహ్మద్ కమ్‌గర్ తెలిపారు. వర్షాలపై బగ్లాన్ పోలీస్ కమాండ్ చీఫ్ అబ్దుల్ గఫూర్ ఖాడెమ్ స్పందించారు. అకాల వర్షాలతో సంభవించిన భారీ వరదల కారణంగా బగ్లాన్ ప్రావిన్స్‌లోని లర్ఖబ్ ప్రాంతంలో ఎక్కువ ప్రాణనష్టం జరిగినట్టు తెలిపారు. అలాగే 300కు పైగా ఇళ్లు ధ్వంసమైనట్టు వెల్లడించారు. మరోవైపు బాధిత కుటుంబాలు తమను ఆదుకోవాలని కోరుతున్నాయి. కాగా, గత వారం కూడా ఆఫ్ఘనిస్తాన్ అంతటా భారీ వరదల ఫలితంగా 300 మందికి పైగా మరణించగా, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల వ్యవసాయ భూమి నాశనమైంది.