Trump: ట్రంప్ పై మాజీ మోడల్ స్టాసీ విలియమ్స్ సంచలన ఆరోపణలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై మాజీ మోడల్ స్టాసీ విలియమ్స్‌ సంచలన ఆరోపణలు చేశారు

Update: 2024-10-24 10:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై మాజీ మోడల్ స్టాసీ విలియమ్స్‌ సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వెల్లడించారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ది గార్డియన్‌’ లో ఈమేరకు సంబంధించిన స్టోరీ వచ్చింది. 1992లో ట్రంప్‌తో తనకు పరిచయం ఏర్పడినట్లు అందులో పేర్కొంది. ప్రముఖ ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein)తో డేటింగ్‌లో ఉన్న టైంలో ఈ ఇష్యూ జరిగిందని వార్తలొచ్చాయి. ‘‘ ఓ పార్టీలో ట్రంప్ తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు జెఫ్రీ నన్ను, న్యూయార్క్‌లోని ట్రంప్‌ ఆఫీస్ కి తీసుకెళ్లాడు. నన్ను చూసి జెఫ్రీ, ట్రంప్‌ నవ్వుకున్నారు. అప్పుడే ట్రంప్ నన్ను తన వైపునకు లాక్కొని ఎంతో అసభ్యంగా తాకారు’’ అని ఆ కథనంలో ఉంది. అంతేకాకుండా, జెఫ్రీ, ట్రంప్‌ మంచి స్నేహితులని.. వారిద్దరూ ఎంతో సమయం గడిపేవారని స్టాసీ విలియమ్స్ తెలిపారు. అతడు 20 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఆమె ఈ విషయాలను పోన్ కాల్ ద్వారా కమలా హ్యారిస్ బృందానికి తెలియజేస్తే.. వారు మీడియాకు తెలిపారు.

ట్రంప్ రియాక్షన్

స్టాసీ విలియమ్స్ ఆరోపణలపై ట్రంప్‌ ప్రచారబృందం స్పందించింది. ఇదంతా తప్పుడు కథనం అంటూ కొట్టిపారేసింది. ఇకపోతే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున ట్రంప్ మరోసారి బరిలో నిలిచారు. ఇప్పటికే, లైంగిక వేధింపుల కేసులో ఆయన దోషిగా తేలారు. అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కారొల్‌పై ట్రంప్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు న్యూయార్క్‌ కోర్టు తేల్చింది. ఆయనను దోషిగా పేర్కొంటూ 5 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. అంతేకాకుండా.. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్‌తో సంబంధం ఉందని.. ఈ విషయాన్ని సెటిల్ చేసుకునేందుకు ఆమెతో అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్న కేసులోనూ ట్రంప్ దోషిగా తేలారు.


Similar News