బ్యాలెట్ పేపర్ల ప్రింట్‌కు డబ్బు లేక ఎన్నికలు వాయిదా.. ప్రభుత్వానికి మరో సవాల్!

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు మరో సవాల్ ఎదురైంది.

Update: 2023-02-21 14:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు మరో సవాల్ ఎదురైంది. వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికల నిర్వహణ ఆ దేశ ప్రభుత్వానికి ఛాలెంజ్‌గా మారింది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ దేశం.. ఎన్నికల నిర్వహణను భరించే స్థితిలో కూడా లేదని అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసింది.

బ్యాలెట్ పేపర్లును ప్రింట్ చేయడానికి డబ్బులు లేకపోవడంతో శ్రీలంక స్థానిక ఎన్నికలను వాయిదా వేసినట్లు మంగళవారం ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆ దేశ ఆదాయం ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు మరియు అవసరమైన సేవలను నిర్వహించడానికి సరిపోవడం లేదని.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు అసాధ్యమని గతంలోనే పాలకులు స్పష్టం చేశారు. అయితే సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఎన్నికల కమిషన్ ఇటీవల సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.

అయితే బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఇంధనం, పోలింగ్ బూత్‌లకు పోలీసు రక్షణ కోసం నిధులు ఇవ్వడానికి ట్రెజరీ నిరాకరించడంతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని తాజాగా ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకను రాజకీయ అస్థిరత పెద్ద సవాలుగా మారిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గొటబయ రాజపక్స స్థానంలో ప్రెసిడెంట్‌గా వచ్చిన విక్రమసింఘేపై అక్కడి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారాన్ని అంటిపెట్టుకునేందుకే ప్రభుత్వం ఆర్థిక నిధుల లేమిని సాకుగా చూపిస్తోందని మండిపడుతున్నాయి. సకాలంలో ఎన్నికలను నిర్వహించి ప్రజా తీర్పుకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం పార్లమెంట్ వాయిదా పడింది. 

Tags:    

Similar News