సముద్రంలో దొరికిన రూ. 25,000 కోట్ల డ్రగ్స్
రూ. 25,000 కోట్లు.. ఇది ఏదైనా రాష్ట్ర బడ్జెట్ అని అనుకుంటున్నారా..? కానే కాదు !!
కొచ్చి: రూ. 25,000 కోట్లు.. ఇది ఏదైనా రాష్ట్ర బడ్జెట్ అని అనుకుంటున్నారా..? కానే కాదు !! మన దేశ పరిధిలోని హిందూ మహాసముద్ర జలాల్లో గత శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ), భారత నౌకాదళం నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో దొరికిన 2,525 కిలోల హై గ్రేడ్ మేథామ్ ఫెటామైన్ డ్రగ్స్ మొత్తం విలువ. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ దొరకడం ఇదే తొలిసారి అని ఎన్‌సీబీ వెల్లడించింది.
పాకిస్తాన్‌కు చెందిన డ్రగ్స్‌తో ఒక నౌక ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ నుంచి బయలుదేరి హిందూ మహాసముద్ర జలాల్లోకి ప్రవేశించిందని తెలిపింది. డ్రగ్స్, చిన్నపాటి బోట్లతో నింపిన ఆ షిప్పు హిందూ మహాసముద్ర జలాల్లోకి ప్రవేశించిందని.. దాని నుంచి చిన్న బోట్లను సముద్రంలోకి దింపి వాటి ద్వారా సమీపంలోని నగరాలకు డ్రగ్స్ ను సప్లై చేశారని దర్యాప్తులో గుర్తించామని పేర్కొంది.
ఇండియాలోని తీర ప్రాంత నగరాలకు డ్రగ్స్ ను సప్లై చేసిన తర్వాత శ్రీలంక, మాల్దీవులకు వెళ్లి అక్కడి డ్రగ్ స్మగ్లర్లకు సరుకును అందించాలని ప్లాన్ చేశారని వెల్లడించింది. అయితే ఎన్‌సీబీ, భారత నౌకాదళం రంగంలోకి దిగడంతో వారి ఆటకట్టు అయిందని చెప్పింది. 2022 ఫిబ్రవరిలో భారతదేశం ప్రారంభించిన "ఆపరేషన్ సముద్రగుప్త"లో భాగంగానే డ్రగ్స్ సప్లై ముఠాను పట్టుకోగలిగామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్పష్టం చేసింది.