52 ఏళ్ల తర్వాత సింహాసనం వీడిన రాణి.. ఎవరు ?
దిశ, నేషనల్ బ్యూరో : డెన్మార్క్ రాణి మార్గరెట్-II అధికారం చేపట్టిన 52 ఏళ్ల తర్వాత సింహాసనం వీడారు.
దిశ, నేషనల్ బ్యూరో : డెన్మార్క్ రాణి మార్గరెట్-II అధికారం చేపట్టిన 52 ఏళ్ల తర్వాత సింహాసనం వీడారు. రాజధాని కోపన్‌హెగన్‌లోని క్రిస్టియన్స్‌బోర్గ్ ప్యాలెస్‌లో సంబంధిత దస్త్రాలపై ఆదివారం ఆమె సంతకం చేశారు. దీంతో రాజు ‘ఎరిక్ 3 లామ్’ అనంతరం 900 ఏళ్ల పెద్ద గ్యాప్ తర్వాత సింహాసనాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న మొదటి వ్యక్తిగా మార్గరెట్-II నిలిచారు. దీంతో మార్గరెట్-II పెద్ద కుమారుడు, క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడెరిక్-10 రాజు అయ్యారు. ఇక నుంచి ఆయన డెన్మార్క్ రాజుగా, గ్రీన్‌ల్యాండ్, ఫారోయి దీవులకు దేశాధినేతగా ఉండనున్నారు. ఫ్రెడెరిక్-10 భార్య మేరీ రాణిగా, పెద్ద కుమారుడు క్రిస్టియన్ క్రౌన్ ప్రిన్స్, రాజ వారసుడిగా మారారు. అయితే మార్గరెట్-IIకు ‘రాణి’ అనే బిరుదు కొనసాగనుంది.1972లో డెన్మార్క్ రాజు ఫ్రెడెరిక్-9 మరణానంతరం ఆమె రాణిగా కిరీటం ధరించారు. గతేడాది మార్గరెట్-IIకు వెన్నెముక శస్త్రచికిత్స జరిగింది. ఇది తన భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేసిందని పేర్కొన్న ఆమె.. తర్వాతి తరానికి బాధ్యతలు అప్పగించనున్నట్లు కొత్త సంవత్సరం వేళ అనూహ్య ప్రకటన చేశారు. ఆదివారం బాధ్యతల నుంచి వైదొలిగారు.