లండన్ ఘటనపై ఢిల్లీ పోలీసుల కేసు నమోదు
లండన్‌లోని భారత దౌత్య కార్యాలయంలో ఖలిస్తానీ మద్దతుదారుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది.
న్యూఢిల్లీ: లండన్‌లోని భారత దౌత్య కార్యాలయంలో ఖలిస్తానీ మద్దతుదారుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ ఘటనలో ఉపా చట్టం, ప్రభుత్వ ఆస్తులపై దాడుల నియంత్రణ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇటీవల ఖలిస్తానీ వేర్పాటువాదీ అమృత్ పాల్ సింగ్ కోసం వెతుకులాటను నిరసిస్తూ లండన్‌తో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ మద్దతు దారులు దౌత్యకార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టారు. లండన్‌లో భారత్ జెండాను అవమానించడమే కాకుండా కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
దీనిపై భారత్ యూకే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రత కల్పించడంలో విఫలమయ్యారని విమర్శలు చేసింది. ఈ క్రమంలో చర్యలకు దిగింది. మరోవైపు యూకే ప్రభుత్వం దౌత్యకార్యాలయం వద్ద భద్రతను పటిష్టం చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది.