బ్రిటన్ రాజుగా చార్లెస్ 3కి పట్టాభిషేకం
బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం లండన్ మినిస్టర్ అబ్బేలో అట్టహాసంగా జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం లండన్ మినిస్టర్ అబ్బేలో అట్టహాసంగా జరిగింది. దాదాపు 2 వేల మంది ప్రపంచాధినేతలు, వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చార్లెస్ 3 పట్టాభిషేకం జరిగింది. రాణి కెమిల్లాతో కలిసి వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేకి వచ్చిన వెంటనే ఆయన బ్రిటన్ రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చార్లెస్-3 మాట్లాడుతూ న్యాయంగా ప్రజలను పరిపాలిస్తానన్నారు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తానని చెప్పారు. ప్రజలే స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని పెంపొందిస్తానని తెలిపారు.
ఇక చార్లెస్ 3 పట్టాభిషేకం కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ఆయన భార్య డాక్టర్ సుదీప్ ధంఖర్ పాల్గొన్నారు. నిన్ననే జగదీప్ ధంఖర్ దంపతులు లండన్ వెళ్లారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చార్లెస్ 3 ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో చార్లెస్ 3ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్‌తోనూ జగదీప్ ధంఖర్ సంభాషించారు. బ్రిటన్ ప్రధాన మంత్రి భార్య హెచ్.ఈ. అక్షతా మూర్తితో పాటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు హెచ్.ఈ. ఐజాక్ హెర్జోగ్, బ్రెజిల్ అధ్యక్షుడు H.E. లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాను సైతం కలిసి కొద్దిసేపు మాట్లాడారు. అటు చార్లెస్ 3 కూడా వీరితో ముచ్చడించారు.
అయితే చార్లెస్ 3 పట్టాభిషేకానికి ముందు సెంట్రల్ లండన్‌లో ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కొందరు రిపబ్లిక్ నాయకులు యత్నించడంతో వారిని పోలీసుల అరెస్ట్ చేశారు. కాగా 1953లో క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేకం జరిగింది. ఏడు దశాబ్దాల తర్వాత చార్లెస్ 3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది.