దేశాల మధ్య అంతరిక్ష పోటీ.. 2030 నాటికి చంద్రుడిపైకి చైనా వ్యోమగాములు
దేశాల మధ్య అంతరిక్ష పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రుడిపై శాస్త్రీయ అన్వేషణ కోసం 2023 నాటికి మానవ సహిత మిషన్‌ను పంపాలని చైనా భావిస్తోంది
బీజింగ్: దేశాల మధ్య అంతరిక్ష పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రుడిపై శాస్త్రీయ అన్వేషణ కోసం 2030 నాటికి మానవ సహిత మిషన్‌ను పంపాలని చైనా భావిస్తోంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సన్నాహకాల్లో భాగంగా ముందుగా అంతరిక్ష కేంద్రానికి మూడో సెట్ వ్యోమగాములను మంగళవారం పంపుతున్నట్టు చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ లిన్ జికియాంగ్ తెలిపారు.
ఈ అంతరిక్ష నౌక ముగ్గురు వ్యోమగాములను టియాగాంగ్ అనే అంతరిక్ష కేంద్రానికి తీసుకెళుతుందని లిన్ చెప్పారు. చంద్రుడిపై మనుషులతో కూడిన అన్వేషణ కార్యక్రమాన్ని చైనా ఇటీవలే ప్రారంభించింది. 2025 నాటికి తమ వ్యోమగాములను పంపుతామని నాసా, చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా తమ మిషన్‌ను మొదలు పెట్టింది.
దీంతో దేశాల మధ్య అంతరిక్ష పోటీ అధికమైంది. షెంజౌ-16 స్పేస్ ఫ్లైట్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లడానికి ముగ్గురు వ్యోమగాములు జింగ్ హైపెంగ్, ఝు యాంగ్జు, గుయ్ హైచావో ఎంపికయ్యారు. ఝు, గుయ్ తొలిసారి స్పేస్ ట్రిప్‌కు వెళుతున్నారు. ఝు స్పేస్ ఫ్లైట్ ఇంజినీర్‌గా వ్యవహరిస్తారు. ఈ ముగ్గురు ఐదు నెలల పాటు ఆర్బిట్‌లో (కక్ష్య) ఉంటారు.