ఎల్లో సముద్రంలో ఘోర ప్రమాదం.. 55 మంది చైనా నావీ సిబ్బంది మృతి!

ఎల్లో సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది.

Update: 2023-10-04 14:05 GMT

బీజింగ్ : ఎల్లో సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. చైనాకు చెందిన న్యూక్లియర్ సబ్‌మెరైన్‌‌కు జరిగిన ప్రమాదంలో.. అందులోని 55 మంది నావీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విదేశీ యుద్ధ నౌకలను, సబ్ మెరైన్ లను నిలువరించేందుకు ఎల్లో సముద్రం లోపల చైనా ఆర్మీ ఏర్పాటుచేసిన ఉచ్చులో.. అదే దేశానికి చెందిన ‘093417’ అణు జలాంతర్గామి చిక్కుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ వివరాలను చైనా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బ్రిటన్ ఇంటెలీజెన్స్ విభాగాలు ఈవివరాలను తెలిపాయంటూ ఆ దేశానికి చెందిన మీడియాలో కథనాలు పబ్లిష్ అయ్యాయి.

ఆగష్టు 21న ఉదయం 8:12 గంటలకు ఎల్లో సముద్రంలోని ఉచ్చులో సబ్ మెరైన్ చిక్కుకున్నాక, అందులో సాంకేతిక సమస్యలు తలెత్తి ఆక్సిజన్ సిస్టమ్‌ దెబ్బతిందని తెలిపాయి. దీంతో ఊపిరాడక అందులోని నౌకాదళ సిబ్బంది అంతా చనిపోయారని కథనాల్లో పేర్కొన్నారు. చైనా ఆర్మీ ఆరు గంటలపాటు కష్టపడి ఈ సబ్ మెరైన్‌ను ఉపరితలంపైకి తీసుకొచ్చే సరికి, అందులోని 55 మంది నావీ సిబ్బంది చనిపోయి ఉన్నారని బ్రిటీష్ మీడియా వెల్లడించింది. చనిపోయిన వారిలో 22 మంది కీలక నౌకాదళ అధికారులు ఉన్నారని తెలిపింది. ఈ ప్రమాదంపై అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను చైనా ఖండించింది. దీంతో ఈ ప్రమాదం వివరాలు వెలుగుచూడకుండా చైనా అడ్డుకుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.


Similar News