చైనా, మాల్దీవుల మధ్య సైనిక ఒప్పందం: భారత్‌తో వివాదాల వేళ కీలక పరిణామం
భారత్-మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ సహకార ఒప్పందం కుదిరింది.
దిశ, నేషనల్ బ్యూరో: భారత్-మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అగ్రిమెంట్‌పై ఇరు దేశాలు సంతకం చేశాయి. మాల్దీవుల రక్షణ మంత్రి ఘసన్ మౌమూన్, చైనా ప్రతినిధి మేజర్ జనరల్ జాంగ్ బావోక్న్‌లు అధికారికంగా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయి. మాల్దీవుల నూతన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆ నుంచి భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవడానికి గడువు విధించిన నేపథ్యంలోనే ఈ అగ్రిమెంట్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అగ్రిమెంట్ ఏమిటి?
చైనా-మాల్దీవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం..చైనా ఉచితంగా మాల్దీవులకు సైనిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఏయే అంశాల్లో సహాయం చేస్తుందన్న విషయాలను ఇరు దేశాలు బహిర్గతం చేయలేదు. కానీ చైనా నుంచి వచ్చే సహాయంతో రెండు దేశాల మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత పెంచుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక చైనా రీసెర్చ్ నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 3కి సంబంధించి కూడా ఒక ఒప్పందం కుదరినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నౌక ఇటీవలే మాల్దీవులు జలాల్లోకి ప్రవేశించింది. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర పరిశోధనలను పెంచేందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రదేశంలో ఉన్న మాల్దీవులు, ఈ ప్రాంతంలో సముద్ర భద్రత, వాణిజ్య మార్గాలలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఒప్పందం భారత్‌కు కాస్త ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ అగ్రిమెంట్ వివరాలు వెల్లడించకపోవడంతో మాల్దీవుల్లోనూ ఆందోళన నెలకొంది.