భారత్- అమెరికా ఒప్పందాలపై చైనా అక్కసు
అమెరికాతో భారత్ పలు కీలక రక్షణ ఒప్పందాలు చేసుకోవడంపై చైనా గుర్రుగా ఉంది.
దిశ,వెబ్‌డెస్క్: అమెరికాతో భారత్ పలు కీలక రక్షణ ఒప్పందాలు చేసుకోవడంపై చైనా గుర్రుగా ఉంది. రెండు దేశాల మధ్య కుదిరిన జెట్ ఇంజన్ల సంయుక్త ఉత్పత్తి సహా పలు కీలక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడం చైనాకు మింగుడు పడటం లేదు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం అనేది ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు విఘాతం కలిగించేలా ఉండకూడదంటూ చైనా నీతులు చెబుతోంది. తృతీయ పక్షాన్ని లక్ష్యం చేసుకునేలా ఒప్పందాలు ఉండకూడదని పేర్కొంది. భారత్, అమెరికా రక్షణ ఒప్పందాలపై విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌యి ఈ మేరకు స్పందించారు.
నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు ముందు చైనా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చైనా ఆర్ధిక ప్రగతిని అడ్డుకునేందుకే భారత్‌ను అమెరికా అడ్డుపెట్టుకుంటోందని చైనా వ్యాఖ్యలు చేసింది. అమెరికా భౌగోళిక రాజకీయ లెక్కలతో భారత్‌తో ఆర్ధిక వాణిజ్య బంధాలను పటిష్టం చేసుకునేందుకు సంప్రదింపులు జరుపుతుందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ వెల్లడించింది. అమెరికా ఇచ్చే హామీలకు కట్టుబడి ఉండదని చైనా దౌత్యవేత్త వాంగ్‌యి పేర్కొన్నారు. చైనాపై జరిపే బల్క్‌వార్‌లో భారత్‌ను అమెరికా ఉపయోగించుకుంటుందని అన్నారు.
అంతర్జాతీయ సరఫరాలో చైనా స్ధానాన్ని భారత్ సహా మరే దేశం భర్తీ చేయలేనందున అమెరికా భౌగోళిక రాజకీయ అంచనాలు విఫలమవుతాయని తెలిపారు. బీజింగ్‌కు వ్యతిరేకంగా భారత్‌ను ఎగదోసే ఆటలు ఫలించబోవని చైనా తన అక్కసును వెళ్లగక్కింది.