సుడాన్ అంతర్యుద్ధానికి బ్రేక్.. ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతం చేసిన భారత్
సుడాన్‌పై పట్టుకోసం సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది.
దిశ, డైనమిక్ బ్యూరో: సుడాన్‌పై పట్టుకోసం సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. సైన్యం, పారామిలిటరీ మధ్య కొనసాగుతున్న ఈ యుద్ధానికి 3 రోజుల పాటు(72 గంటలు) విరమించేందుకు ఇరు వర్గాల జనరల్స్ అంగీకరించిటనట్లు అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గత 48 గంటలుగా జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఆ దేశ సైన్యం, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి 72 గంటల పాటు దేశవ్యాప్త కాల్పుల విరమణను అమలు చేసేందుకు అంగీకరించినట్లు బ్లింకెన్ తెలిపారు.
ఇరు వర్గాల మధ్య భీకర పోరు నేపథ్యంలో ఆ దేశంలో విమానాశ్రయాలన్నింటిని మూసేసిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ అంగీకారంతో సుడాన్‌లో చిక్కుకున్న విదేశీయులు సురక్షితంగా తమ ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు 4వేల మందికి పైగా వారి దేశాలకు చేరుకున్నారు. సుడాన్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ఆపరేషన్ కావేరిని చేపట్టిన కేంద్రం ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. కాగా, సుడాన్ అల్లర్లలో ఇప్పటి వరకు మొత్తం 420 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 వేల మందికిపైగా గాయపడ్డారు.