నిజ్జర్ హత్య విషయంలో కెనడా పీఎం మళ్లీ పాతపాటే!
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాతపాటే పాడారు. నిజ్జర్ హత్యపై అమెరికట్లు తమతోనే ఉన్నారని వ్యాఖ్యానించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాతపాటే పాడారు. నిజ్జర్ హత్యపై అమెరికట్లు తమతోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం మాంట్రియాల్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ట్రూడో.. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్య దేశాలు సీరియస్ గా తీసుకోవాలన్నారు. కెనడా, దాని మిత్రదేశాలు భారత్ తో కలిసి నిర్మాణాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉంది.
కెనడా పౌరుడిని మా గడ్డపై హత్య చేయడంలో వాస్తవాలను వెలికి తీసేందుకు భారత్ మాతో కలిసి పని చేయాలని చెప్పారు. ఇదే సమయంలో భారత్ తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడంలో తమ దేశం ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. కీలక భౌగోళిక రాజకీయ ప్రాధాన్యత ఉన్న దేశం. భారత్ తో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై మేము సీరియస్ గా పని చేస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే నిజ్జర్ విషయంలో అమెరికా మద్దతు మాకే అని ట్రూడో చెబుతుంటే అమెరికా మాత్రం నిజ్జర్ ఊసే ఎత్తడం లేదు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిజ్జర్ వ్యవహారంపై ఇరుదేశాల మంత్రులు ఎటువంటి ప్రకటన చేయలేదు. అసలు ఈ విషయంలో వీరి మధ్య చర్చలకు వచ్చిందా అనే విషయం కూడా వెల్లడించలేదు. నిజ్జర్ విషయంలో అమెరికా మద్దతు మాకే అని కెనడా ప్రధాని ఓపెన్ కామెంట్స్ చేసినా ఈ విషయంపై బహిరంగా మాట్లాడేందుకు మాత్రం వాషింగ్టన్ ఇష్టపడటం లేదు.