WHO ఆడిటర్‌గా భారత ‘కాగ్’ ముర్ము

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గిరీశ్ చంద్ర ముర్ము ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)కు ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌గా రెండోసారి ఎన్నికయ్యారు

Update: 2023-05-29 16:29 GMT

న్యూఢిల్లీ: భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గిరీశ్ చంద్ర ముర్ము ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)కు ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌గా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన 2024 నుంచి 2027 వరకు కొనసాగుతారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో ఆడిటర్‌గా 2019 నుంచి పని చేస్తున్న గిరీశ్ 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో నిర్వహించిన ఓటింగ్‌లో మళ్లీ విజయం సాధించారు. జెనీవాలో జరిగిన ఈ ఓటింగ్‌లో మొత్తం 156 ఓట్లకు గాను గిరీశ్ 114 ఓట్లతో బంపర్ మెజారిటీ సాధించారు.

ఐక్యరాజ్య సమితిలో భారత దేశ శాశ్వత ప్రతినిధి, అధికారుల అవిశ్రాంత కృషి వల్లే రెండోసారి ఎన్నిక సాధ్యమైందని గిరీశ్ తెలిపారు. వృత్తి నిబద్ధత, పారదర్శకత, మెరుగైన ఫలితాల వల్లే తనకు ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌గా డబ్ల్యూహెచ్‌వోలో రెండోసారి పనిచేసే అవకాశం లభించిందన్నారు. ఆయన ఇప్పటికే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (అంతర్జాతీయ కార్మిక సంస్థ)కు ఎక్స్ టర్నల్ ఆడిటర్ గా కూడా ఎన్నికయ్యారు.

గిరీశ్ ప్రస్తుతం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఆహారం, వ్యవసాయ సంస్థ)కు 2020 నుంచి 2025 వరకు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (అంతర్జాతీయ అణుశక్తి సంస్థ)కు 2022 నుంచి 2027 వరకు, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ (నిషేధిత, రసాయన ఆయుధాల సంస్థ)కు 2021 నుంచి 2023 వరకు ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌గా పని చేస్తున్నారు.

Tags:    

Similar News