అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా నల్గొండ సంతతి బాలుడు

అమెరికాలో భారత సంతతికి చెందిన బాలుడు 90 సెకన్లలో 29 పదాలను తప్పుల్లేకుండా సరిగ్గా స్పెల్లింగ్ చేసి 2024 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్‌గా నిలిచాడు

Update: 2024-05-31 07:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో భారత సంతతికి చెందిన బాలుడు 90 సెకన్లలో 29 పదాలను తప్పుల్లేకుండా సరిగ్గా స్పెల్లింగ్ చేసి 2024 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్‌గా నిలిచాడు. ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ గురువారం జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో 30 పదాలలో 29 పదాలను సరిగ్గా ఉచ్చరించాడు. దీంతో అతనికి కప్‌తో పాటు $50,000 ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఈ పోటీల్లో మొత్తం 245 మంది విద్యార్థులు పాల్గొనగా, వారిలో 8 మంది ఫైనల్‌కు చేరుకున్నారు. ఫైజాన్ జాకీ, బృహత్ సోమ మధ్య పోటీ టై కావడంతో ఇద్దరికి మరోచాన్స్‌‌గా 90 సెకన్ల సమయం ఇచ్చారు. ఫైజాన్ జాకీ 20 పదాలను సరిగ్గా చెప్పగా, బృహత్ సోమ 29 పదాల స్పెల్లింగ్‌లను తప్పుల్లేకుండా చెప్పి విజేతగా నిలిచాడు.

ది EW స్క్రిప్స్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ అయిన ఆడమ్ సింసన్ బ్రూహత్‌కు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందించారు. కేవలం 12 సంవత్సరాల వయస్సులో, బ్రూహత్ తన జ్ఞానం, ప్రశాంతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని సిమ్సన్ చెప్పారు. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో బ్రూహత్ సోమ పాల్గొనడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2023లో 74వ స్థానం, 2022లో 163వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుత పోటీలో రెండో స్థానంలో నిలిచిన టెక్సాస్‌లోని అలెన్‌కు చెందిన జాకీ $25,000 అందుకున్నాడు. బృహత్ సోమ తెలుగు సంతతికి చెందిన వాడు. బృహత్ తండ్రి శ్రీనివాస్ సోమ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ.


Similar News