Brazil : సావోపాలో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారతీయులు..!

బ్రెజిల్‌లో సావోపాలోలోని విమానాశ్రయంలో దాదాపు వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

Update: 2024-08-25 00:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్రెజిల్‌లో సావోపాలోలోని విమానాశ్రయంలో దాదాపు వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. భారత్ నుంచే కాక నేపాల్, వియత్నామీస్‌తో సహా 666 మంది ఆసియా వలసదారులు (migrants) చిక్కుకుపోయి ఉన్నారని రాయిటర్స్ (Reuters) అనే ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. కాగా వీరందరూ వీసాలు లేకుండానే బ్రెజిల్ లోకి ప్రవేశించి అక్కడి నుండి అమెరికా, కెనడాలకు అక్రమంగా వలస పోవడానికి ప్రయత్నించారని, దీంతో వీరిపై బ్రెజిల్ ఆంక్షలు విధించిందని బ్రెజిల్ పబ్లిక్ డిఫెండర్ ఆఫీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.ఈ క్రమంలో వీరు విమానాశ్రయంలో గత రెండు రోజులుగా నేలపై నిద్రిస్తున్నారని, ఆహారం, నీరు కూడా అందుబాటులో లేవని రాయిటర్స్ వార్త సంస్థ తెలిపింది.

ఆంక్షలు విధించడానికి గల కారణం ఏంటి..?

కాగా గత కొన్ని రోజుల నుండి ఆసియా నుంచి వచ్చే కొందరు విదేశీయులపై బ్రెజిల్‌ ఆంక్షలు విధించడం ప్రారంభింది. అమెరికా, కెనడా దేశాలకు వలస వెళ్లేందుకు తమ దేశాన్ని లాంచింగ్‌ పాయింట్‌గా వాడుకుంటూ ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ న్యాయ శాఖ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది.విమానాశ్రయంలో ఆశ్రయం కోసం భారత్‌, నేపాల్‌, వియత్నాం జాతీయుల నుంచి 70 శాతానికి పైగా అభ్యర్థనలు వస్తున్నాయని తెలిపింది. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నఈ ఆంక్షల్లో భాగంగా ఇకపై ఆసియా దేశాల నుంచి వచ్చేవారు బ్రెజిల్‌లో వలసదారులుగా ఉండాలంటే వీసా తప్పని సరిగా ఉండాలి. అయితే ఇప్పటికే వీసా నుంచి మినహాయింపు పొందిన ఆసియన్లకు ఈ నిబంధన వర్తించదని ఆ దేశ న్యాయ శాఖ వెల్లడించింది.


Similar News