బాంబ్ స్క్వాడ్ బృందంపై దాడి: పాక్‌లో ఇద్దరు సైనికుల మృతి

పాకిస్థాన్‌లో బాంబ్ స్వ్కాడ్ బృందంపైనే బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Update: 2024-04-01 06:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో బాంబ్ స్వ్కాడ్ బృందంపైనే బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఓడరేవు నగరం గ్వాదర్ సమీపంలో అంకారా డ్యామ్ వద్ద మందుపాతరలను తొలగిస్తున్న టైంలో వారిపై ఈ దాడి జరిగినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనను గ్వాదర్ ఎస్ఎస్పీ మొహ్సిన్ జోహైబ్ ధ్రువీకరించారు. దాడి అనంతరం సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. అయితే వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) గతంలో గ్వాదర్‌లో అనేక దాడులకు పాల్పడింది. బలూచిస్తాన్‌లో చైనా పెట్టుబడులను బీఎల్ఏ వ్యతిరేకిస్తోంది. చైనా, పాక్ దేశాలు వనరుల దోపిడీకి పాల్పడుతున్నాయని కొంతకాలంగా ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను పాక్ కొట్టివేసినప్పటికీ నిరంతరం దాడులు జరుగుతుందటం ఆందోళన కలిగిస్తున్నది. గత నెల 24న కూడా పాక్‌లోని రెండో అతిపెద్ద ఎయిర్ స్టేషన్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News