నెతన్యాహుకు భారీ షాక్..ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ మంత్రి రాజీనామా

ఇజ్రాయెల్‌లోని నెతన్యాహు ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆ దేశ యుద్ధ కేబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ తన పదవికి రాజీనామా చేశారు.

Update: 2024-06-10 03:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌లోని నెతన్యాహు ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆ దేశ యుద్ధ కేబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ టీవీ చానెల్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. గాజా యుద్ధంలో బందీల ఒప్పందానికి సంబంధించి పీఎం నెతన్యాహు తీసుకున్న వైఖరే గాంట్జ్ రాజీనామాకు కారణమని తెలుస్తోంది. నెతన్యాహు కారణంగానే హమాస్‌ను అంతమొందించలేకపోయామని గాంట్జ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయం వైపు వెళ్లకుండా నియంత్రిస్తున్నారని, అందుకే బరువెక్కిన హృదయంతో అత్యవసర ప్రభుత్వాన్ని విడిచిపెడుతున్నట్టు తెలిపారు.

గాంట్జ్ ప్రకటనపై వెంటనే స్పందించిన నెతన్యాహు..తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. యుద్ధం నుంచి విరమించుకునే సమయం కాదని, పోరాటంలో భాగం కావాలని తెలిపారు. అలాగే జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ జివిర్, ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ లు కూడా గాంట్జ్ రాజీనామాపై స్పందించారు. యుద్ధ సమయంలో ప్రభుత్వం నుంచి రాజీనామా చేయడం సరికాదని, ఈ నిర్ణయం మార్చుకోవాలని తెలిపారు. గాంట్జ్ నిష్క్రమణ ప్రభుత్వానికి తక్షణ ముప్పు కలిగించదు, ఎందుకంటే వారు ఇప్పటికీ ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మెజారిటీని కలిగి ఉన్నారు. కానీ నెతన్యాహుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

కాగా, మాజీ మిలిటరీ చీఫ్ అయిన గాంట్జ్ నెతన్యాహు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించబడుతున్నారు. వార్ క్యాబినెట్‌లో చేరడానికి ముందు, అతను ప్రతిపక్షంలో ప్రముఖ సభ్యుడు. అక్టోబర్ 7న హమాస్ దాడి జరిగిన వెంటనే నెతన్యాహు ప్రభుత్వంలో చేరాడు. అంతర్జాతీయంగా గాంట్జ్ మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. అయితే బందీలందరినీ విడుదల చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని పదేపదే పిలుపునిచ్చారు. అలాగే యుద్ధానంతరం గాజా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని నెతన్యాహుకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే నెతన్యాహు వీటికి తిరస్కరించడంతోనే గాంట్జ్ తప్పుకున్నట్టు అంతర్జాతీయ మీడియాతో కథనాలు వెలువడుతున్నాయి.


Similar News