బందీలను విడిపించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం : బైడెన్

ఉగ్రవాదులు చిన్నపిల్లల తలలను తెగ్గోసే చిత్రాలను చూస్తానని జీవితంలో ఎన్నడూ అనుకోలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు.

Update: 2023-10-12 11:33 GMT

వాషింగ్టన్‌ : ఉగ్రవాదులు చిన్నపిల్లల తలలను తెగ్గోసే చిత్రాలను చూస్తానని జీవితంలో ఎన్నడూ అనుకోలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడులు అత్యంత పాశవికమైనవని పేర్కొన్నారు. గత శనివారం హమాస్‌ ఉగ్రవాదులు వందల మందిని దారుణంగా చంపేశారని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించిన నేపథ్యంలో బైడెన్‌ ఈ కామెంట్స్ చేశారు. ‘‘అక్టోబరు 7వ తేదీ.. హాలోకాస్ట్ తర్వాత యూదులకు అత్యంత ప్రాణాంతక రోజుగా పరిణమించింది. హమాస్ ఉగ్రవాదులు, ఐసిస్ కన్నా అత్యంత దారుణాలకు తెగబడ్డారు’’ అని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడిలో 22 మంది అమెరికా పౌరులు మరణించారని, 17 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వెల్లడించారు.

‘‘బందీలను విడిపించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. దానికోసం ప్రత్యేకంగా నిపుణులు పనిచేస్తున్నారు’’ అని బైడెన్ తెలిపారు. మరోవైపు అమెరికాలోని యూదుల ప్రతినిధులతో బైడెన్‌ సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. హమాస్‌కు మద్దతుగా ఉన్న ఇరాన్‌ను సైతం హెచ్చరించినట్లు బైడెన్‌ వారికి తెలిపారు. ‘‘ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో నిరంతరం వాకబు చేస్తున్నాను. యూదు ప్రజల భద్రతకు నేను కట్టుబడి ఉన్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, ‘‘ఉగ్రవాదులు పిల్లల తలలను నరికేసిన ఫొటోలను బైడెన్ నేరుగా చూడలేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అధికార ప్రతినిధి చేసిన ప్రకటనల ఆధారంగా బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు’’ అని వైట్ హౌజ్ వివరణ ఇవ్వడం గమనార్హం.


Similar News