తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం..12 గంటల్లోనే 80కి పైగా ప్రకంపనలు
ద్వీప దేశం తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవిం చింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు సుమారు 80 ప్రకంపనలు రావడంతో ప్రజలు వణికిపోయారు.
దిశ, నేషనల్ బ్యూరో: ద్వీప దేశం తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు సుమారు 80 ప్రకంపనలు రావడంతో ప్రజలు వణికిపోయారు. వీటిలో అత్యధిక తీవ్రత 6.3గా నమోదైంది. హువాలియన్ తూర్పు కౌంటీలో భూమికి 5.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది. మొదటి భూకంపం 5.5తీవ్రతతో సంభవించగా..చివరిది 6.3గా నమోదైంది. భూ ప్రకంపనల ధాటికి హువాలియన్‌లోని పలు భవనాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.
అలాగే రాజధాని తైపీతో సహా, పశ్చిమ తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో దీని ప్రభావం ఉన్నట్టు సమాచారం. అక్కడ కూడా పలు భవనాలు ప్రభావితమైనట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. భవనాలు ఊగిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.జపాన్, చైనా, ఫిలిప్పీన్స్‌లోనూ స్వల్ప ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తోంది. అయితే ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, ఈ నెల3వ తేదీన కూడా తైవాన్‌లోని హువాలియన్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5తీవ్రతతో నమోదు కాగా..అనేక భవనాలు నేలకూలాయి. దీంతో 14 మంది మరణించారు. అప్పటి నుంచి వరుసగా భూప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. భూకంపాలు రావడానికి అధిక అవకాశం ఉండే రెండు ‘టెక్టోనిక్ ప్లేట్స్’ జంక్షన్ వద్ద తైవాన్ ఉంది. అందుకే ఆ దేశం ఎక్కువగా భూకంపాలకు గురవుతోంది.