పాలస్తీనా భూభాగంలోకి వచ్చిన ఇజ్రాయెల్ వ్యక్తిపై దాడి చేసిన స్థానికులు

ఇజ్రాయెల్ దేశానికి చెందిన పౌరుడు ఒకరు పొరపాటున వెస్ట్ బ్యాంక్‌లోని జెరూసలేం, రమల్లా మధ్య ఉన్న పాలస్తీనా పట్టణం ఖలాండియాలోకి ప్రవేశించగా అతడిపై అక్కడి స్థానికులు దాడి చేయడానికి ప్రయత్నించారు

Update: 2024-06-30 07:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ దేశానికి చెందిన పౌరుడు ఒకరు పొరపాటున వెస్ట్ బ్యాంక్‌లోని జెరూసలేం, రమల్లా మధ్య ఉన్న పాలస్తీనా పట్టణం ఖలాండియాలోకి ప్రవేశించగా అతడిపై అక్కడి స్థానికులు దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో బాధితుడు తన కారుతో సహా వారి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, వెనక నుంచి స్థానికులు రాళ్లతో దాడి చేశారు. పారిపోయే ప్రయత్నంలో ఆ వ్యక్తి కారుపై నియంత్రణ కోల్పోయి అక్కడి సైనిక తనిఖీ కేంద్రం సమీపంలోని కాంక్రీట్ డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆ తరువాత అతడిని సైనికులు వారి బారి నుంచి కాపాడి జెరూసలేంలోని షారే జెడెక్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. బాధితుడి కారును స్థానికులు తగులబెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్టోబరు 7న గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత వెస్ట్ బ్యాంక్‌ ప్రాంతంలో హింసాత్మక పరిస్థితులు గణనీయంగా పెరిగాయి. ఇప్పటి వరకు 553 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెలీ దళాలచే చంపబడ్డారని పాలస్తీనియన్ అధికారులు నివేదించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల మాటలు వినకుండా గాజాపై దాడులు చేస్తుండటం, అలాగే అక్కడి సంక్షోభానికి కారణం అవుతుండటంతో ఇజ్రాయె‌ల్‌పై పలు దేశాల్లో వ్యతిరేకత వస్తుంది.


Similar News