అమెరికా ఆరోపణలు సరికాదు..పన్నూన్ కేసులో భారత్‌కు రష్యా మద్దతు
ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా వాదనలను రష్యా తోసిపుచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా వాదనలను రష్యా తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో యూఎస్ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు అందజేయలేదని తెలిపింది. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో మాట్లాడారు. భారత్‌లో అంతర్గత రాజకీయ పరిస్థితులను చెడగొట్టడానికి, ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను క్లిష్టతరం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘అమెరికా మత స్వేచ్ఛ గురించి నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. కానీ భారతదేశ జాతీయత, చరిత్రపై యూఎస్‌కు అవగాహన లేదు. ఆ దేశ చర్యలు భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే. అమెరికా వాదనలకు ఎలాంటి సాక్షాలూ లేవు. కాబట్టి ఇది ఆమోదయోగ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు.
దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా కంటే అణచివేత పాలనను ఊహించడం కష్టమని జఖరోవా చెప్పారు. హత్యకు కుట్ర చేశారని వాదిస్తున్న అమెరికా దానికి తగిన ఆధారాలను ఎందుకు అందించలేక పోయిందని ప్రశ్నించారు. రష్యా, సౌదీ అరేబియా విధానాలను అనుసరించడానికి భారత్ ప్రయత్నిస్తోందని వాషింగ్టన్ పోస్ట్ చేసిన నివేదికపై కూడా యూఎస్ స్పందించాలని తెలిపింది. క్రమం తప్పకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని సూచించింది. భారత్‌ను అమెరికా అగౌరవ పరుస్తోందని తెలిపారు.
కాగా, ఖలిస్థానీ నేత గురుపత్వంత్ సింగ్‌ను అమెరికాలో హత్య చేసేందుకు భారత్ కుట్ర పన్నిందని యూఎస్ ఆరోపిస్తోంది. దీనిపై విచారణకు సైతం ఆదేశించింది. దీనిపై విచారణకు భారత్ కూడా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ క్రమంలో గురుపత్వంత్ హత్యకు భారత్ కుట్ర చేసింది నిజమేనని ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిలో భారత గూఢచార సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంది. భారత ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలిసే ఉండొచ్చని తెలిపింది. అయితే దీనిపై భారత్ తీవ్రంగా మండిపడగా..అమెరికా సైతం భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని ప్రకటించింది.