US Election: డెమోక్రటిక్ పార్టీ సమావేశాల్లో హిందూ పూజారి ప్రార్థన

అమెరికాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది

Update: 2024-08-22 03:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా కమలా హారిస్ ప్రత్యర్థికి పోటీగా మద్దతును సంపాదించడానికి సమావేశాలను నిర్వహిస్తూ అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అన్ని వర్గాలకు చేరువ కావడానికి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా చికాగోలో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ 3వ రోజున జరిగే సమావేశాల్లో భారత-అమెరికన్ పూజారి రాకేష్ భట్ అధ్యక్షతన తొలి ప్రార్థనలు నిర్వహించిన తర్వాత సమావేశాలను ప్రారంభించారు. అమెరికాలో ఉన్నటువంటి హిందూ సమాజ వర్గం వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఈవెంట్ ఉపయోగపడనుంది.

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ప్రముఖ హిందూ పూజారి పండిట్ రాకేష్ భట్ డెమోక్రటిక్ పార్టీ సమావేశాల్లో 3వ రోజు సాంప్రదాయ హిందూ ప్రార్థనతో సెషన్‌ను ప్రారంభించారు. ప్రాచీన భారతీయ భావన అయిన 'వసుధైవ కుటుంబం' అంటే 'ప్రపంచమంతా ఒకే కుటుంబం'. అందరం సమాజాభివృద్ధి కోసం ఐక్యంగా ఉండాలి. మనస్సులు కలిసి ఆలోచించనివ్వాలి. ఇది మనల్ని శక్తివంతం చేస్తుంది, తద్వారా మన దేశం గర్వపడేలా చేయవచ్చు అని పేర్కొంటూ సమావేశాన్ని ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతున్నప్పుడు "ఓం శాంతి శాంతి" నినాదాలు హాల్ అంతటా ప్రతిధ్వనించాయి. దీంతో ఒక్కసారిగా పార్టీ సమావేశం కాస్త ఆధ్యాత్మికంగా మారిపోయింది. కమలా హారిస్‌కు మద్దతుగా వచ్చిన వేలాది మంది మద్దతుదారుల సమావేశంలో పూజారి రాకేష్ భట్ తొలి ప్రార్థనను నిర్వహించడంపై భారతీయ హిందూ సమాజం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదట సంస్కృతంలో పవిత్ర మంత్రాలను పఠించిన తరువాత వాటిని ఆయన ఆంగ్లంలోకి అనువదించారు. రాకేష్ భట్ బెంగళూరు నుండి అమెరికా వెళ్ళిన పూజారి. ఆయన హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, తుళును అనర్గళంగా మాట్లాడగలరు.

Tags:    

Similar News