లైంగిక ఆరోపణలపై 91 ఏళ్ల కెనడా బిలియనీర్ అరెస్ట్

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై కెనడాకు చెందిన బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-06-08 09:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై కెనడాకు చెందిన బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆయన షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. 91 ఏళ్ల వ్యాపారవేత్త మహిళపై అసభ్యకరమైన దాడి చేయడం, అత్యాచారం, బలవంతంగా నిర్బంధించడంతో సహా ఐదు క్రిమినల్ నేరాలకు పాల్పడ్డారని పోలీసులు అభియోగాలు మోపారు. 1980ల నుండి 2023 మధ్య కాలంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పీల్ ప్రాంతీయ పోలీసులు అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే, ఫ్రాంక్ స్ట్రోనాచ్‌ బాధితులు ఎవైరనా ఉంటే ధైర్యంగా ముందుకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వాహన తయారీ దారుల కోసం విడిభాగాలు తయారు చేసే కెనడాకు చెందిన మాగ్నా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు స్ట్రోనాచ్ ప్రస్తుతం విడుదల కాగా, తరువాత తేదీలో బ్రాంప్టన్‌లోని అంటారియో కోర్టులో జరగబోయే విచారణకు హాజరు కానున్నట్లు పోలీసులు తెలిపారు. అతని తరపు న్యాయవాది మాత్రం ఫ్రాంక్ స్ట్రోనాచ్‌పై వచ్చిన అన్ని ఆరోపణలను నిరాధారమైనవని అన్నారు. అయితే విచారణకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు న్యాయవాది పేర్కొన్నారు.

కెనడా వ్యాపార ప్రముఖుల్లో ఫ్రాంక్ స్ట్రోనాచ్‌ ఒకరు. ఆయన గుర్రపు పందాలలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. స్ట్రోనాచ్‌ అరెస్ట్‌పై స్పందించిన మాగ్నా సంస్థ మీడియాలో వచ్చిన ఆరోపణలతో పాటు, దర్యాప్తు గురించి తమకు ఎలాంటి అవగాహన లేదని ఒక ప్రకటనలో పేర్కొంది. 2010లో కంపెనీ నియంత్రణను వదులుకున్నప్పటి నుండి స్ట్రోనాచ్‌కు మాగ్నాతో ఎలాంటి అనుబంధం లేదు అని మాగ్నా ప్రతినిధి తెలిపారు.


Similar News