గాజాలో 73 మంది మృతి

ఉత్తర గాజాలోని బెత్ లాహియా నగరంపై ఇజ్రాయెల్ వైమానికదాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 73 మంది పౌరులు మరణించినట్టు స్థానిక అధికారులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు.

Update: 2024-10-20 17:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర గాజాలోని బెత్ లాహియా నగరంపై ఇజ్రాయెల్ వైమానికదాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 73 మంది పౌరులు మరణించినట్టు స్థానిక అధికారులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని, ఇంకా చాలా మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయారని వివరించారు. శనివారం రాత్రి ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. బెత్ లాహియాలో పౌరులు నివాసముండే చోటే ఇజ్రాయెల్ దాడి చేసిందని తెలిపారు. దాడి జరిపిన మాట వాస్తవమేనని, కానీ, వారు చెబుతున్న సంఖ్య నమ్మశక్యంగా లేదని ఇజ్రాయెల్ పేర్కొంది. తాము కూడా క్షతగాత్రుల సంఖ్యను పరిశీలిస్తున్నామని, తమ మిలిటరీ వద్దనున్న సమాచారంతో సరిపోలడం లేదని తెలిపింది. గడిచిన ఒక్క రోజులో గాజా, లెబనాన్‌లో 175 టెర్రరిస్టు టార్గెట్లపై తమ వైమానిక దళం దాడి చేసినట్టు వివరించింది.

ఆయుధ కర్మాగారం ధ్వంసం

లెబనాన్ రాజధాని బీరూట్‌లోని హిజ్బుల్లా సెంట్రల్ కమాండ్ సెంటర్‌‌పై ఇజ్రాయెల్ ఆదివారం ఉదయం దాడి చేసి ధ్వంసం చేసింది. అలాగే, అండర్‌గ్రౌండ్‌లోని ఆయుధ కర్మాగారాన్ని కూడా నాశనం చేసింది. ఈ వైమానిక దాడులకు ముందే తాము ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని హెచ్చరించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. అలాగే, దక్షిణ లెబనాన్‌లో జరిపిన దాడుల్లో ముగ్గురు కీలకమైన హిజ్బు్ల్లా ఆపరేటివ్‌లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. నబాతియే పట్టణంపై ఇజ్రాయెల్ ఏడు సార్లు వైమానిక దాడులు చేపట్టిందని వార్తలు వచ్చాయి. ఈ దాడుల్లో ఓ బిల్డింగ్ కూలిపోవడంతో బాధిత పౌరుల కోసం సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.

ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా అటాక్

బీరూట్‌లోని తమ సెంట్రల్ కమాండ్ సెంటర్, ఆయుధ కర్మాగారంపై దాడికి ప్రతిగా హిజ్బుల్లా ఆదివారం మధ్యాహ్నం ఉత్తర ఇజ్రాయెల్‌పై సుమారు 160 రాకెట్లు పంపింది. ఇజ్రాయెల్ నగరం సఫెద్‌పై దాడి చేసింది. ఈ నగరంలో పలుచోట్ల రాకెట్లు పడ్డాయని, కొన్ని చోట్ల మంటలు ఎగిసిపడ్డాయని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. 15 బృందాల అగ్నిమాపక సిబ్బంది, ఆరు హెలికాప్టర్లు ఆ ఏరియాలో మోహరించి ఎక్కడ మంటలు ఎగసినా ఆర్పేయడానికి పని చేశాయి. ఈ దాడుల కారణంగా ప్రధాన రహదారులను కొంతసేపు క్లోజ్ చేశారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టమేమీ జరగలేదు.

Tags:    

Similar News