క్వారంటైన్‌లోకి.. కంట్రీస్!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దెబ్బకు పలుదేశాలు అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అవసరమైతే తప్పా ఇంటి బయట అడుగుపెట్టొద్దని సూచిస్తున్నాయి. దేశాలకు దేశాలే.. మిగతా ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని ‘ఏకాంతవాసం’లోకి జారుకుంటున్నాయి. ప్రజలనూ స్వచ్ఛంద క్వారంటైన్ పాటించాలని ఆదేశిస్తున్నాయి. ఈ కాలపు ఆరోగ్య సంక్షోభంగా కరోనావైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్ణించింది. ప్రతి దేశం తప్పకుండా అనుమానితులందరినీ పరీక్షించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సోకినవారి సంఖ్య 1,82,400లకు(జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం..) పైగా చేరింది. దాదాపు 7,100 […]

Update: 2020-03-17 07:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దెబ్బకు పలుదేశాలు అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అవసరమైతే తప్పా ఇంటి బయట అడుగుపెట్టొద్దని సూచిస్తున్నాయి. దేశాలకు దేశాలే.. మిగతా ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని ‘ఏకాంతవాసం’లోకి జారుకుంటున్నాయి. ప్రజలనూ స్వచ్ఛంద క్వారంటైన్ పాటించాలని ఆదేశిస్తున్నాయి.

ఈ కాలపు ఆరోగ్య సంక్షోభంగా కరోనావైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్ణించింది. ప్రతి దేశం తప్పకుండా అనుమానితులందరినీ పరీక్షించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సోకినవారి సంఖ్య 1,82,400లకు(జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం..) పైగా చేరింది. దాదాపు 7,100 మందిని పొట్టనబెట్టుకున్నది. సుమారు 80వేల మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ వైరస్ మొదటగా వెలుగుచూసిన చైనాలో కరోనాతో మరణించినవారి కంటే.. చైనా వెలుపల ప్రాణాలుకోల్పోయినవారి సంఖ్య అధికమవుతుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వైరస్ విస్తరిస్తున్న వేగాన్ని ఈ వివరణ తెలుపుతున్నది.

అమెరికాలో 4,400పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 87 మంది చనిపోయారు. యూఎస్‌లో పదిమందికి మించి ఒకచోటా గుమిగూడొద్దని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. యూరప్‌లో కోట్లాది మంది ఇంటి నుంచి బయట అడుగుపెట్టని పరిస్థితుల్లో ఉన్నారు. భారత్ సహా కొన్ని ఆసియా దేశాలు.. పాఠశాలలు, సినిమా థియేటర్లు, ఇతర వినోద వేడుకలు సహా అత్యవసరమైన పనులు మినహా మరే అవసరాలకు బయటికి వెళ్లొద్దని నిషేధాజ్ఞలు విధించాయి. అంతర్జాతీయ ప్రయాణాలపైనా ఆంక్షలు విధించాయి.

ఫ్రాన్స్‌లో సుమారు 6,600 మందికి ఈ వైరస్ సోకగా.. 148 మంది మరణించారు. మనం యుద్ధభూమిలో ఉన్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించారు. ప్రజలు వీధుల్లోకి రావొద్దని ఆ దేశ మంత్రి క్రిస్టఫ్ కాస్టనర్ సూచించారు. అంతేకాదు, ఈ ఆదేశాలను అమలు చేసేందుకు సర్కారు సుమారు లక్ష మంది పోలీసులను మోహరిపంజేసింది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి బయటికి వస్తే 135 యూరోల(సుమారు రూ. 11వేలు) జరిమానా విధించేందుకూ సిద్ధమైంది.

చైనా కంటే వేగంగా ఇటలీ, స్పెయిన్‌లలో ఈ వైరస్ వ్యాపిస్తున్నది. ఇటలీలో సుమారు 27వేలకుపైగా మందికి ఈ వైరస్ సోకింది. 2,158 మంది మరణించారు. 2,749 మంది వైరస్ బారినుంచి బయటపడ్డారు. ఈ దేశంలో శవాగారాలు మృతదేహాలతో నిండిపోయాయి. దహన సంస్కారాల సేవలు తలకుమించిన భారంగా మారింది. హాస్పిటళ్లలో రద్దీతో తమ ప్రియతములను చూడలేకపోతున్నారు. కొందరైతే అంతిమ సంస్కారాలకు హాజరుకాలేకపోతున్నారు. అంతదారుణంగా మృతుల సంఖ్యలు పెరిగిపోతున్నాయి. చైనా మినహా అత్యధికంగా కరోనావైరస్‌తో చనిపోయినవారి సంఖ్య ఇక్కడే నమోదైంది.

* ఇరాన్‌లో కొత్తగా 135 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఈ వైరస్ బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 988కి చేరింది. కాగా, ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా 85వేల మంది ఖైదీలను ఇరాన్ ప్రభుత్వం తాత్కాలికంగా విడుదల చేసింది.

* 553 కరోనా కేసులు నమోదైన మలేషియాలో మంగళవారం ఈ వైరస్ కారణంగా తొలి మరణం నమోదైంది.

* ఫిలిప్పీన్స్‌లో కొత్తగా 45 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 187కు చేరింది.

* స్పెయిన్‌లో ఈ వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 491కి చేరింది.

* పాకిస్తాన్‌లో మంగళవారం ఐదుగురికి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలడంతో వైరస్ సోకిన వారి సంఖ్య 189కి పెరిగింది

* ఈజిప్టులో 40 కొత్త కేసులు నమోదవడమే కాదు.. ఇద్దరు వ్యక్తులు ఈ వైరస్‌తో మరణించారు.

* రొమేనియాలో కరోనా కేసులు 168కి చేరడంతో దేశాధ్యక్షుడు ఎమర్జెన్సీని ప్రకటించారు.

* థాయ్‌లాండ్‌లో 30 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనావైరస్ సోకినవారి సంఖ్య 177కు చేరింది.

* కంబోడియాలో మంగళవారం కరోనా కేసులు రెట్టింపయ్యాయి. ఒక్కరోజే 12 కేసులు నమోదుకావడంతో మొత్తం సంఖ్య 24కు పెరిగింది

* దక్షిణ కొరియాలో వైరస్ వ్యాప్తి మందగించినట్టు తెలుస్తున్నది. వరుసగా మూడోరోజు వందలోపే కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 29న ఈ దేశంలో 909 కేసులు నమోదవడం గమనార్హం. కాగా, మంగళవారం 84 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు 8,320కి చేరింది. ఇద్దరి మృతితో కరోనా మరణాల సంఖ్య 81కి చేరింది.

* సోమవారం 16 కొత్త కేసులు వెలుగుచూడటంతో వెనిజులా ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్వారంటైన్ విధించాలని నిర్ణయించింది.

* పొరుగుదేశాలన్నింటికీ వైరస్ వ్యాపించడంతో లిబియా సరిహద్దులను మూసేసింది. ఏకాకిగా ఉంటే వైరస్ సమస్య నుంచి బయటపడొచ్చని ఈ దేశం భావిస్తున్నది.

* లాటిన్ అమెరికాలో 155 కేసులు నమోదవడంతో పలు దేశాలు సరిహద్దులను మూసివేసేందుకు సిద్ధమయ్యాయి. చిలీ దేశం బుధవారం(పర్యాటకులు తిరిగి వెళ్లేందుకు ఇచ్చిన గడువు ముగియడంతోనే) నుంచి సరిహద్దులను మూసివేయనుంది.

* శ్రీలంక రెండు వారాలపాటు ఇన్‌కమింట్ ఫ్లైట్స్‌ను రద్దుచేసింది

tags : coronavirus, global emergency, WHO, quarantine, europe, restrictions, death toll

Tags:    

Similar News