కేపీహెచ్‌బీలో ప్రత్యేక పార్కుల జాడేది?
దిశ, కూకట్పల్లి : నియోజకవర్గంలో హంగు ఆర్భాటాలతో మంత్రులు ప్రారంభిస్తున్న అభివృద్ధి పనులు కేవలం శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా పేరు గాంచిన కేపీహెచ్బీ కాలనీలో ఇప్పటి వరకు రూ.వేల కోట్లు వెచ్చించి ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కానీ.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. డివిజన్ లోని రాజీవ్ సర్కిల్లో 2018 ఏప్రిల్ 13న పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 1.8 ఎకరాల స్థలంలో రూ.2కోట్లతో మహిళలు, చిన్న […]
దిశ, కూకట్పల్లి : నియోజకవర్గంలో హంగు ఆర్భాటాలతో మంత్రులు ప్రారంభిస్తున్న అభివృద్ధి పనులు కేవలం శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా పేరు గాంచిన కేపీహెచ్బీ కాలనీలో ఇప్పటి వరకు రూ.వేల కోట్లు వెచ్చించి ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కానీ.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. డివిజన్ లోని రాజీవ్ సర్కిల్లో 2018 ఏప్రిల్ 13న పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 1.8 ఎకరాల స్థలంలో రూ.2కోట్లతో మహిళలు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక పార్కు, 1, 2 ఫేజ్ ల మధ్య 2.39ఎకరాల స్థలంలో రూ.2.88కోట్లతో పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. నాటి నుంచి నేటి వరకు రెండేండ్లు గడుస్తున్న పనులు మాత్రం ప్రారంభించలేదు.
అధికారుల నిర్లక్ష్యం..
హౌసింగ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్కు పనులు ప్రారంభించాల్సిన కాంట్రాక్టర్లు పనులు చేపట్టకుండా చేతులు ఎత్తేసి పారి పోతున్నారు. పనులను పట్టించుకోవాల్సిన అధికారులు అసలు అందుబాటులో ఉండకపోవడం కూడా పనులు ముందుకు సాగక పోవడానికి ప్రధాన కారణమని పలువురు ఆభిప్రాయ పడుతున్నారు.
80శాతం పనులు ఏవి…?
కేపీహెచ్భీకాలనీలో ప్రతి సారి జరిగే సమావేశాల్లో 80శాతం పనులు పూర్తయ్యాయి, ఇంకా 20శాతం పనులు మిగిలి ఉన్నాయని చెప్పుకుంటున్నారు తప్పా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కేపీహెచ్బీకాలనీలో రూ.2.78కోట్ల వ్యయంతో ఏర్పాటు చే సిన ఫిష్ మార్కెట్ ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలే దు. అదే విధంగా కేపీహెచ్బికాలనీలోని ఇండోర్ స్టేడి యం నిర్మాణ పనులు ఏండ్లు గడుస్తున్నా పూర్తి కాలే దు. ఇలా కేపీహెచ్బీకాలనీలో ప్రతిచోట అభివృద్ధి పనులు అసంపూర్తిగానే కొనసాగుతూ ఉన్నాయి.
ప్రసంగాల్లోనే ప్రస్తావన…
కేపీహెచ్బీకాలనీలో మహిళలు, చిన్నారుల కోసం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా పార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రజా ప్రతినిధులు పార్కు పనులు ప్రారంభించడంలో కనీసం కసరత్తు చేయడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రసంగాల్లో మాత్రమే మహిళా పార్కు ప్రస్తావన ప్రధానంగా వినిపిస్తుంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోని ప్రతి సమావేశంలో ప్రస్తావన వచ్చినా భౌతికంగా మాత్రం కనిపించడం లేదు.
పార్కింగ్ స్థలంగా…
మహిళలు, చిన్నారుల కోసం ఏర్పాటు చేయనున్న పార్కు స్థలంలో పార్కు పనులు అటుంచితే పార్కు స్థలం ముందు భాగం పూర్తిగా ప్రైవేట్ రెస్టారెంట్ కు పార్కింగ్ కేంద్రంగా మారింది. రెస్టారెంట్ కు వచ్చిన వారు, దారిన పోయే వారు ఆ స్థలంలోనే కాలకృత్యాలు తీర్చుకోవడం, వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు.
నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం
శంకుస్థాపన అనంతరం టెండర్ ప్రక్రియ పూర్తయిన తరువాత పనులు ప్రారంభించాల్సిన కాంట్రాక్టర్ పనులు చేయకుండా వెళ్లి పోయాడు. దీంతో పనులు ప్రారంభం కాలేదు. కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్ప చెప్పడం జరిగింది. 2018లో ప్రతిపాదించిన వ్యయంలోనే పనులను కొత్త కాంట్రాక్టర్ తో చేయిస్తున్నాం. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేస్తాం. – అప్పారావు, డీఈ, హౌసింగ్ బోర్డు