లిక్కర్‌పై లేడీ సర్‘పంచ్‌లు’…
దిశ, కరీంనగర్: పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్కా.. కుటుంబాలను చక్కదిద్దిన ఆ అమ్మలకు గ్రామాన్ని సక్రమంగా నడిపియ్యడం పెద్ద విషయమా.. కళ్ల ముందు చిన్న అన్యాయం జరిగితేనే సహించలేని మహిళలు.. మద్యం అమ్మకాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతుంటే చూస్తూ ఊర్కుంటారా..? వారి చేతిలో ఏమాత్రం అధికారమున్నా బెల్టుషాపులపై కొరఢా ఝళిపించకుండా ఉంటారా? నో నో అంటున్నారు ఈ ముగ్గురు మహిళా సర్పంచులు. ఈ మూడు గ్రామాల సర్పంచ్‌లకు యువత కూడా తోడు కావడంతో […]
దిశ, కరీంనగర్: పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్కా.. కుటుంబాలను చక్కదిద్దిన ఆ అమ్మలకు గ్రామాన్ని సక్రమంగా నడిపియ్యడం పెద్ద విషయమా.. కళ్ల ముందు చిన్న అన్యాయం జరిగితేనే సహించలేని మహిళలు.. మద్యం అమ్మకాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతుంటే చూస్తూ ఊర్కుంటారా..? వారి చేతిలో ఏమాత్రం అధికారమున్నా బెల్టుషాపులపై కొరఢా ఝళిపించకుండా ఉంటారా? నో నో అంటున్నారు ఈ ముగ్గురు మహిళా సర్పంచులు. ఈ మూడు గ్రామాల సర్పంచ్‌లకు యువత కూడా తోడు కావడంతో మద్యం విక్రయదారులు తోకముడిచారు. ఈ మూడు పల్లెల్లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దామా…
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజన దాదాపు మూడు నెలల క్రితం నుంచే గ్రామంలో మద్యం అమ్మకాలు జరపొద్దని నిర్ణయించారు. అయినా సర్పంచ్ మాటను బేఖాతరు చేస్తూ కొందరు బెల్టుషాపులు నడిపిస్తున్నారు. సర్పంచ్ సరోజన రంగంలోకి దిగారు. బెల్టు షాపుల్లోకి వెళ్లి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. మరోసారి మద్యం అమ్మేందుకు సాహసిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో గ్రామంలో బెల్టు షాపుల ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు వెలిచాల గ్రామం నో లిక్కర్ విలేజ్‌గా మారి చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో బెల్ట్ షాపులను నిషేధిస్తూ ఆ గ్రామపంచాయితీ ఇటీవల ఓ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం అమ్మితే రూ.10 వేల జరిమానాతోపాటు ఆ ఇంట్లో పొందే ప్రభుత్వ రేషన్, వాటర్ కనెక్షన్స్ కూడా కట్ చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామంలో పంచాయతీ సిబ్బంది మైకుల ద్వారా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ సర్పంచ్ నిరోషా కిరణ్ బెల్టు షాపులు నిర్వహించవద్దన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామ యువత సరికొత్త నిర్ణయం తీసుకుంది. గ్రామంలో మద్యం అమ్మకాలను జరపకుండా చొరవ తీసుకోవాలని కోరుతూ సర్పంచ్‌కు వినతిపత్రం అందించారు. గతంలో గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మద్యం సేవించి చనిపోవడం కలిచివేయడంతో తమ గ్రామంలో మద్యం అమ్మకాలు జరపవద్దని నిర్ణయించుకున్నామని యువకులు వివరించారు.