అమరావతిని సమ్మక్క సారలమ్మలు కాపాడేనా?

            ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రైతుల దుస్థితి ఎక్కే మెట్టు దిగే మెట్టుగానే ఉంది. ఎవరి దగ్గరకెళ్లినా న్యాయం చేస్తామనే వారే కానీ.. న్యాయం చేసేవారు కానరావడం లేదు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా ఎవరైనా న్యాయం చేయగలరని అనిపిస్తే చాలు వాళ్ల కాళ్లదగ్గర వాలిపోతున్నారు. ఎవరైనా రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని చెబుతారని ఆశగా ఎదురు చూస్తున్నారు. అమరావతి కూడా రజధానే కదా […]

Update: 2020-02-08 07:40 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రైతుల దుస్థితి ఎక్కే మెట్టు దిగే మెట్టుగానే ఉంది. ఎవరి దగ్గరకెళ్లినా న్యాయం చేస్తామనే వారే కానీ.. న్యాయం చేసేవారు కానరావడం లేదు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా ఎవరైనా న్యాయం చేయగలరని అనిపిస్తే చాలు వాళ్ల కాళ్లదగ్గర వాలిపోతున్నారు. ఎవరైనా రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని చెబుతారని ఆశగా ఎదురు చూస్తున్నారు. అమరావతి కూడా రజధానే కదా అన్న మాటలతో తీవ్ర అసంతృప్తికి లోనవుతూ తిరిగి అమరావతికి చేరుకుంటున్నారు.

అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు, మహిళలు గత 53 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులంతా గళమెత్తారు. ఆందోళనలతోనే ఆగకుండా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ‘రాజధానికి భూములిచ్చిన రైతులది త్యాగం కాదా’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే, తానున్నంత వరకూ రాజధాని తరలింపు జరగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇవ్వడంతో వారంతా పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టకున్నారు. ఇటీవలే బీజేపీతో జనసేన జతకట్టడంతో ఆ ఆశలు మరింత పెరిగాయి. కేంద్రం నుంచీ ఎలాగైనా జగన్ పై ఒత్తిడి తీసుకొచ్చేలా చేసి, రాజధానిని తరలించకుండా పవన్ ఆపుతారని అంతా భావించారు.

అయితే అనూహ్యంగా.. కేంద్రప్రభుత్వమే రాజధానుల అంశం రాష్ట్రప్రభుత్వానికి సంబంధించినదేనని స్పష్టం చేయడంతో వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం మినహా, దాదాపు అన్ని పార్టీలూ, వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ జగన్ పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకే మొగ్గుచూపుతున్నారు. రాజధాని భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ సిట్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో కొంత మంది టీడీపీ నేతలు ఇళ్లు దాటడంలేదంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న అమరావతి ప్రాంత రైతులు మాత్రం రాజధాని వికేంద్రీకరణకే ఏమాత్రం సంసిద్ధంగా లేరు. దీంతో రాజధాని రైతులు కనిపించిన వారికల్లా తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.

రాజధాని జేఏసీగా ఏర్పడి విపక్షాలన్నింటినీ ఆహ్వానించి మద్దతు కోరాయి. వారు కోరినట్టే విపక్షాలన్నీ వారికి మద్దతునిచ్చాయి. మరోవైపు పలువురు రాజకీయ పారిశ్రామిక వేత్తలు కూడా రైతుల డిమాండ్ మేరకు అమరావతికే జైకొడుతున్నారు. ఇంకోవైపు సినీ ప్రముఖులకు కూడా తమగోడు చెప్పుకున్నారు. ఇంకొంతమంది సినీ పరిశ్రమకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరోవైపు బెజవాడ కనక దుర్గమ్మ చెంతకు మూడు రాజధానులు వద్దు అమరావతినే ముద్దు అంటూ పాదయాత్రగా వెళ్లి పూజలు, యాగాలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణాలు, గోవింద నామాలు, లలిత సహస్ర నామాలు జపిస్తున్నారు. తాజాగా నేడు తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు వచ్చి, ఆ సమ్మక్క సారల్లమ్మలనూ దర్శించకున్నారు. అమరావతినే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా కొనసాగించేలా చూడాలని మొక్కుకున్నారు. జగన్ మనసు మార్చాలని కోరుతూ నిలువెత్తు బంగారం(బెల్లం) వనదేవతలకు సమర్పించారు. కోరిన కోరికలన్నింటినీ తీరుస్తారనే పేరున్న సమ్మక్కసారలమ్మలు అమరావతి రైతుల కోరికను మన్నించి, జగన్ మనసు మారుస్తారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News