తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. విద్యుత్ చార్జీలు పెరగనున్నాయా?

దిశ, తెలంగాణ బ్యూరో : డిస్కంల పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు తప్పేలా లేదు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలు బయటపడాలంటే పెంపు అనివార్యం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఈఆర్సీకి సమర్పించగా, అందులో కొత్త టారీఫ్ వివరాలు లేకపోవడంతో వాటిని వెంటనే అందజేయాల్సిందిగా డిస్కంలను ఈఆర్సీ ఆదేశించింది. తెలంగాణ డిస్కంలు నష్టాల ఊబి నుంచి బయటపడలేకపోతున్నాయి. సర్కారు నుంచి సబ్సిడీ అందుతున్నా నష్టాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సబ్సిడీ అందకుంటే పీకల్లోతు నష్టాల్లో […]

Update: 2021-11-30 21:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : డిస్కంల పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు తప్పేలా లేదు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలు బయటపడాలంటే పెంపు అనివార్యం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఈఆర్సీకి సమర్పించగా, అందులో కొత్త టారీఫ్ వివరాలు లేకపోవడంతో వాటిని వెంటనే అందజేయాల్సిందిగా డిస్కంలను ఈఆర్సీ ఆదేశించింది.

తెలంగాణ డిస్కంలు నష్టాల ఊబి నుంచి బయటపడలేకపోతున్నాయి. సర్కారు నుంచి సబ్సిడీ అందుతున్నా నష్టాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. సబ్సిడీ అందకుంటే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడం ఖాయమని ఉత్తర, దక్షిణ డిస్కంల నివేదికలను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. రెండు డిస్కంలు ఏఆర్ఆర్ (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్) నివేదికలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి మంగళవారం సమర్పించాయి. వాటిలో విద్యుత్ చార్జీల పెంపు ప్రస్తావన, కొత్త టారీఫ్ వివరాలు లేకపోవడంతో వాటిని వెంటనే అందజేయాల్సిందిగా మండలి చైర్మన్ శ్రీరంగారావు ఆదేశించారు. డిస్కంల ఆదాయ లోటును పూడ్చుకోడానికి రీటైల్ విద్యుత్ సరఫరా చార్జీల (టారీఫ్‌)ను పెంచక తప్పదని స్పష్టం చేశారు.

రూ.10 వేల కోట్లకు పైనే లోటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డిస్కంల లోటు రూ.10,624 కోట్లుగా ఉన్నది. మొత్తం రూ.45,618 కోట్ల మేర నిధులు అవసరమైతే అందులో వినియోగదారుల నుంచి బిల్లుల రూపంలో కేవలం రూ.29,343 కోట్ల మేర ఆదాయం మాత్రమే వస్తున్నదని, ఈ లోటు పూడ్చుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో రూ.5,652 కోట్లు వస్తుందని అంచనా వేసినట్టు నివేదికలో డిస్కంలు పేర్కొన్నట్టు సమాచారం. చివరకు రూ.10,624 కోట్ల మేర లోటు కొనసాగనున్నది. మొత్తం అవసరాల్లో సుమారు 25% లోటు (నష్టం)లోనే డిస్కంలు కొనసాగుతున్నాయి. ఈ నివేదిక వివరాలను బహిర్గతం చేయడానికి డిస్కంల అధికారులు నిరాకరించారు. ఈఆర్సీకి సమర్పించినందున ఆమోదం లభించే వరకు గోప్యంగానే ఉంచనున్నారు. వచ్చే ఆర్థిక (2022-23) సంవత్సరానికి ఈ నష్టం రూ. 10,928 కోట్లకు పెరగనున్నది. డిస్కంల అవసరాలకు మొత్తం రూ.53,053 కోట్లు అవసరమవుతుందని అంచనా. ఇందులో వినియోగదారుల నుంచి బిల్లుల రూపంలో రూ.36,474 కోట్టు రానున్నట్టు అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ. 5652 కోట్లు సమకూర్చినా ఇంకా నికరంగా రూ.10,928 కోట్లు లోటు ఉండొచ్చని విద్యుత్‌ సంస్థలు ఆ నివేదికల్లో పేర్కొన్నాయి.

టారిఫ్‌ ప్రతిపాదనలు ఇస్తేనే పెంపుపై నిర్ణయం

రాష్ట్ర విద్యుత్ డిస్కంల యాజమాన్యం విద్యుత్ (టారిఫ్‌) చార్జీల ప్రతిపాదనలు ఇస్తేనే పెంచడంపై నిర్ణయం సాధ్యమవుతుందని ఈఆర్‌సీ చైర్మన్‌ శ్రీరంగారావు స్పష్టంచేశారు. గతంలో ఏఆర్‌ఆర్‌ ఇవ్వని 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ట్రూ-అప్‌ చార్జీలకు అనుమతిస్తామన్నారు. తాజా ఏఆర్ఆర్‌లకు సంబంధించి కొత్త టారిఫ్‌ను వెంటనే ప్రకటించాలని ఆదేశించారు. డిస్కంలు ఆర్థిక నష్టాల నుంచి బయటపడాలంటే విద్యుత్‌ చార్జీలను పెంచక తప్పదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే చార్జీలు పెరిగే చాన్స్ ఉంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగలేదని తెలిపారు. క్లీన్ ఎనర్జీ సెస్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు రవాణా లాంటి ఖర్చులు పెరగాయని తెలిపారు. విద్యుత్ అవసరాలను తీర్చాలంటే వీటిని భరించక తప్పదని, కానీ ఆ తరహాలో ఆదాయం మాత్రం రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో నిధులు విడుదలవుతున్నా, కొన్ని సందర్భాల్లో ఇతర రూపాల్లో నిధులను సమకూరుస్తున్నా.. డిస్కంలు నష్టాల్లోకి కూరుకు పోతున్నాయని తెలిపారు. అయినా వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వక తప్పడం లేదన్నారు. నష్టాల నుంచి బయటపడేందుకు విద్యుత్ చార్జీలను పెంచక తప్పదని స్పష్టం చేశారు.

శ్రీరంగారావు, ఈఆర్‌సీ చైర్మన్‌,

Tags:    

Similar News