బడులకు భగీరథ నీళ్లు వచ్చేనా..?
దిశ, ఖానాపూర్: సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ఆరంభం కానున్న నేపథ్యంలో బడులకు మౌళిక వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం తలమునకలయింది. గ్రామ పంచాయితీ సిబ్బంది అవిశ్రాంతంగా పని చేసి బడులని శుభ్రమైతే చేస్తున్నారు. కానీ, జిల్లాలో చాలా బడులకి మిషన్ భగీరథ కనెక్షన్ ఇంకా ఇవ్వకపోవడం గమనార్హం. సాక్షాత్తు విద్యా శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీఈ, ఏఈ లకి అదేశాలు జారీ చేసినప్పటికీ పనులు నత్తనడకన సాగడం గమనార్హం. విద్యా శాఖ నుండి […]
దిశ, ఖానాపూర్: సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ఆరంభం కానున్న నేపథ్యంలో బడులకు మౌళిక వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం తలమునకలయింది. గ్రామ పంచాయితీ సిబ్బంది అవిశ్రాంతంగా పని చేసి బడులని శుభ్రమైతే చేస్తున్నారు. కానీ, జిల్లాలో చాలా బడులకి మిషన్ భగీరథ కనెక్షన్ ఇంకా ఇవ్వకపోవడం గమనార్హం. సాక్షాత్తు విద్యా శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీఈ, ఏఈ లకి అదేశాలు జారీ చేసినప్పటికీ పనులు నత్తనడకన సాగడం గమనార్హం. విద్యా శాఖ నుండి ఏఈ లకి ఫోన్లు చేస్తున్న స్పందించడం లేదని ప్రిన్సిపాల్, హెడ్‌మాస్టర్ లు వాపోతున్నారు. అడిషనల్ కలెక్టర్ నుండి ఎంపీడీఓ స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పాఠశాలల స్థితిగతుల రిపోర్ట్ తీసుకుంటున్నారు.
దానిలో చాలా ముఖ్యంగా కనిపించే పాయింట్ మిషన్ భగీరథ కనెక్షన్ లేకపోవడం, ఒకవేళ కనెక్షన్ ఉంటే నల్లా బిగించకపోవడం, ఇవన్నీ ఉంటే రిపేర్ వలన వాటర్ రాకపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. ఇప్పటికే మండలాల నుండి జిల్లా కార్యాలయాల ద్వారా కనెక్షన్ ఎక్కడ ఉన్నవి ఎక్కడ లేవు అనే వివరాలు పంపి ఉన్నారు. సంవత్సరం క్రితమే ప్రతి విద్యాసంస్థకి మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. అయినా కూడా ఇప్పటికి కనెక్టివిటీ కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.పాఠశాలలు ప్రారంభానికి ఇంకా 3 రోజుల గడువే ఉంది,దానిలో సెలవు దినాలు పోతే ఒక్క రోజే సమయం ఉండడం తో మిషన్ భగీరథ అధికారులు పనులు సమయానికి పూర్తి చేస్తారా..! అనే సంశయానికి గురవుతున్నామని,ఏఈ కి కాల్ చేస్తే స్పందించడం లేదని మోడల్ స్కూల్ సంబంధించి ఒక ప్రిన్సిపాల్ తెలిపారు.
జిల్లాలో మిషన్ భగీరథ లేని పాఠశాలల సంఖ్య మండలాల వారీగా ఇలా ఉన్నాయి.
1.చెన్నారావుపేట -15
2.దుగ్గొండి -20
3.గీసుకొండ -16
4. ఖానాపూర్ -13
5.నల్లబెల్లి -22
6.నర్సంపేట -35
7.నెక్కొండ -22
8.పర్వతగిరి -17
9.రాయపర్తి -14
10.సంగెం -16
11.వర్ధన్నపేట -12
12.ఖిలా వరంగల్ -34
13.వరంగల్ -14
ఇవి కేవలం కనెక్షన్ ఇవ్వని సంఖ్య మాత్రమే, కనెక్షన్ ఉండి కూడా రోడ్లు నిర్మించడం, ఇతర అవసరాల కోసం పైపులైన్ పక్కన తవ్వడం, ఇతరాత్ర కారణాల వలన మిషన్ భగీరథ పైపులు పగిలిపోయి నీళ్లు రాకుండా ఉన్న విద్యా సంస్థలు చాలానే ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి ప్రతి విద్యాసంస్థకి నీటి సరఫరా సజావుగా జరిగే విధంగా చర్యలు గైకొనాలి. పైపులు డామేజ్ వలన మురుగు నీరు చెత్త లోపలికి వెళ్ళి మంచి నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది ,అలాంటివి ఏమైనా ఉంటే సత్వరమే గుర్తించి బాగుచేయాలని ఇటు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఇప్పటికీ మాకు కనెక్షన్ ఇవ్వలేదు
-దామెర రాజేందర్, ప్రిన్సిపాల్ మోడల్ స్కూల్, బుధరావుపేట