దుబ్బాక ‘చేతి’లో ‘గులాబి’ ‘పువ్వు’ల రణరంగం

దిశ, వెబ్‌డెస్క్: గునుగు పూల సందడి వేళ దుబ్బాకను ‘హస్త’గతం చేసుకునేందుకు ‘గులాబి’ ‘పువ్వు’ల రణరంగం మొదలైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక కావడంతో ఓటర్లు ఎటువైపో కూడా తేలిపోనుంది. త్రిముఖంగా సాగే పోరులో ప్రజల నాడి ఎవరిని గెలిపిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. అధికార పార్టీ గెలిస్తే మరో అసెంబ్లీ స్థానం పెరుగుతుంది. ప్రతి పక్షాలకు కూడా ఇదే జరుగుతుంది. కానీ.. ఈ ఎన్నిక కూడికలు తీసివేతలు లాంటి లెక్కలకు మాత్రమే పరిమితం కాదు. […]

Update: 2020-10-19 12:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: గునుగు పూల సందడి వేళ దుబ్బాకను ‘హస్త’గతం చేసుకునేందుకు ‘గులాబి’ ‘పువ్వు’ల రణరంగం మొదలైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక కావడంతో ఓటర్లు ఎటువైపో కూడా తేలిపోనుంది. త్రిముఖంగా సాగే పోరులో ప్రజల నాడి ఎవరిని గెలిపిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.

అధికార పార్టీ గెలిస్తే మరో అసెంబ్లీ స్థానం పెరుగుతుంది. ప్రతి పక్షాలకు కూడా ఇదే జరుగుతుంది. కానీ.. ఈ ఎన్నిక కూడికలు తీసివేతలు లాంటి లెక్కలకు మాత్రమే పరిమితం కాదు. రెండున్నరేళ్ళ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల ఆలోచనను ప్రతిబింబించే ఉప ఎన్నిక. దుబ్బాకలో వచ్చే ఫలితం పార్టీల సమీకరణాల్లో చాలా మార్పులు తీసుకొస్తుంది. రాజకీయ రణరంగంలో కొత్త వ్యూహాలు, ఎత్తుగడలకు నాంది పలకనుంది. అందుకే దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం జరిగే మూడు ముక్కలాటలోని ముగింపు అన్ని పార్టీలనూ ముచ్చటపెడుతోంది. బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులూ ఏదో ఒక రకమైన సింపతీపై ఆశలు పెట్టుకున్నారు.

పార్టీల బలాబలాలు:

ఉప ఎన్నికల్లో ఓటమి ఎరుగని అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఈసారి కూడా సింపతీ కలిసొస్తుందని పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. సోలిపేట రామలింగారెడ్డి మరణాంతరం దుబ్బాక ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అధిష్టానం ఆయన భార్య సుజాతను బరిలోకి దింపింది. దీంతో సానుభూతి ఓట్లు సుజాత వైపు వచ్చే అవకాశం ఉందని లెక్కలేసుకుంది. అందుకే ఆమెను బరిలోకి దింపింది.

హరీశ్ రావు ఉన్నా..?

పార్టీలో ప్రత్యేక గుర్తింపు పొందిన హరీశ్‌రావు తన చతురతతో విజయాన్ని మాత్రమే కాక ఓట్ల మెజారిటీని కూడా అవలీలగా తీసుకొస్తారని ప్రజల్లో ఒక సాధారణ అభిప్రాయం ఉంది. హరీశ్ రావు స్వయంగా సుజాత తరఫున ప్రచార బరిలోకి దిగారు. అన్నీ తానై పార్టీ తరఫున వన్ మాన్ ఆర్మీగా వ్యవహరిస్తున్నారు. అందుకే దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. భారీ మెజార్టీని తీసుకొచ్చే డైనమిక్ లీడర్ ఇప్పుడు కేవలం గెలుపు పైన మాత్రమే దృష్టి సారించారనే ఊహాగానాలు ఆ నియోజకవర్గం నుంచే వస్తున్నాయి. ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందా, ఈసారి ఎదురుగాలి వీస్తుందా అనేది ఫలితాల రోజు తేలనుంది.

సంక్షేమ పథకాల ఫలితాలు:

రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ.. ప్రజా సంక్షేమాలు ప్రజలకు ఏవిధంగా చేరాయో దుబ్బాక ఉప ఎన్నిక నిర్ణయిస్తుందనేది విశ్లేషకుల మాట. ఒకవేళ టీఆర్ఎస్‌కు ఆదరణ ఉంటే తప్పనిసరిగా దుబ్బాకలో గులాబీ జెండాయే ఎగురుతుంది. ఆదరణ ఉందని ఆ పార్టీ బలంగా నమ్మి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ ఉన్నా ఒంటిచేత్తో గెలిపించే హరీశ్‌రావు ఇప్పుడు సర్వశక్తులూ ఎందుకు ధారపోయాల్సి వస్తోందనేది చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ బలమెంతా…

దుబ్బాక ఉపఎన్నికపై కమలనాథులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. గ్రామ స్థాయి నుంచే కఠోరంగా శ్రమిస్తున్నారు. పట్టు వదలకుండా అధికార పార్టీ బలహీనతల మీద దాడికి దిగుతున్నారు. ‘ఎన్నాళ్లీ కుటుంబ పాలన’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రధాన దృష్టి పెట్టారు. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలుపు కోసం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. దీనికి తోడు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిన రఘునందన్ రావుకు సానుభూతి కూడా ఒక మేరకు ప్రజల్లో ఉంది.

రాష్ట్రప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న అనేక సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందన్న అంశాన్ని లేవనెత్తుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, రాష్ట్ర మాజీ అద్యక్షుడు లక్ష్మణ్‌, ధర్మపురి అరవింద్‌ తదితరులంతా రఘునందన్‌ గెలుపు కోసం సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేయడానికి దుబ్బాక ఫలితాన్నే తొలి మెట్టుగా భావిస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు రఘునందన్‌దే గెలుపు అంటూ విసృత ప్రచారం చేస్తూ.. హరీశ్ రావుకు ఓటమి భయం పట్టుకుందని వైరల్ చేస్తున్నారు.

కాంగ్రెస్‌‌ తిరిగొచ్చేనా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ఎంట్రీతో ప్రతిపక్షా హోదాను సైతం కోల్పోయింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది.

ఈ నేపథ్యంలోనే దుబ్బాక టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ.. చెరుకు శ్రీనివాస్‌ రెడ్డికి చివరి నిమిషంలో టికెట్ ఖరారు చేసింది. 2019లో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లోకి వచ్చిన చెరుకు ముత్యంరెడ్డి అనివార్యంగా సోలిపేట రామలింగారెడ్డికి మద్ధతు తెలపాల్సి వచ్చింది. టీఆర్ఎస్‌లో చేరిన తర్వాతనే ముత్యంరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా ఇటీవల అనారోగ్యంతోనే మృతి చెందారు.

ముత్యంరెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ స్థానం ఖాయమని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికే మొగ్గు చూపారు. ఇందుకోసం క్యాడర్‌ను కూడా సమకూర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఆశించిన టికెట్‌ను రామలింగారెడ్డి భార్య సుజాతకు ఇవ్వడంతో.. చెరుకు శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చారు. దీంతో కాంగ్రెస్ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఇక్కడ కూడా సింపతీ వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది.

అయితే, ఈ ఉపఎన్నికతోనే కాంగ్రెస్ కూడా పూర్వ వైభవాన్ని తెచ్చుకునే పనిలో పడింది. ఇందుకోసం కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉత్తమ్ మొదలు రేవంత్ వరకు అందరూ అక్కడ ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని గట్టిగా నినదిస్తున్నారు. చెరుకు శ్రీనివాసరెడ్డి తెరమీదకు రానంతవరకూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న పోటీ ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది.

ప్రజానాడి ఎటువైపు?

దుబ్బాక అసెంబ్లీ కోసం త్రిముఖ పోటీ ఈ మూడు పార్టీలకూ ప్రధానం. గెలుపు, ఓటములు ఆ పార్టీ భవిష్యత్ పరిణామాలను నిర్దేశించనున్నాయి. ప్రజానాడిని పసిగట్టి దానికి తగినట్లుగా ఎత్తులు వేస్తున్నాయి. ముగ్గురు నేతల భవిష్యత్తును మాత్రమే కాక మూడు పార్టీల భవిష్యత్తునూ ఓటర్లు తేల్చనున్నారు. పైకి కనిపించేది ఎలా ఉన్నా సైలెంట్ ఓటింగ్ ఈసారి ఎవరి కొంప ముంచుతుందనేది మూడు పార్టీలకూ గుబులుగా మారింది. ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపినా.. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందో లేదో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Tags:    

Similar News