గెలుపు ఎవరిదో?

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుండగా.. ఫలితాల కోసం బరిలో నిలిచిన అభ్యర్థులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సారి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి 71 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఎవరి ఓట్లు ఎటు పడ్డాయో, ఎవరి ఓట్లు చీలాయో, ఎవరు ఎవరి కొంప ముంచుతారో అనే భయం అన్ని పార్టీల అభ్యర్థులకు పట్టుకుంది. గతం కంటే ఈ సారి పోలింగ్ శాతం కూడా పెరగడంతో.. ఎవరికి లాభమో..? ఎవరికి నష్టమో? రాజకీయ విశ్లేషకులు […]

Update: 2021-03-16 06:21 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుండగా.. ఫలితాల కోసం బరిలో నిలిచిన అభ్యర్థులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సారి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి 71 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో ఎవరి ఓట్లు ఎటు పడ్డాయో, ఎవరి ఓట్లు చీలాయో, ఎవరు ఎవరి కొంప ముంచుతారో అనే భయం అన్ని పార్టీల అభ్యర్థులకు పట్టుకుంది. గతం కంటే ఈ సారి పోలింగ్ శాతం కూడా పెరగడంతో.. ఎవరికి లాభమో..? ఎవరికి నష్టమో? రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. అధిక సంఖ్యలో పోటీచేయడం, ఓటింగ్ కూడా భారీగా జరగడంతో.. ఫలితాల వెల్లడికి ఎక్కువ సమయం పట్టే అవకాశముంది.

పెరిగిన ఓటింగ్ ఎవరి కొంపముంచేనో..?

గత ఎన్నికతో పోల్చుకుంటే ఈసారి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి 76.35 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో 54. 64 శాతం నమోదైంది. ఇప్పుడు పెరిగిన పోలింగ్ తమకే అనుకూలంగా వస్తుందంటూ అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధితోనే పట్టభద్రులు అధికంగా ఓటింగ్‌లో పాల్గొని తమకే ఓటు వేశారంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందంటూ ప్రతిపక్షాలు చెప్పుకొస్తున్నాయి. అయితే అధికార పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సీఎం, కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ స్థానానికి కోదండరామ్ పోటీ చేయడమే అందుకు కారణం. పోటీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ మధ్యే ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

గెలుపు ధీమాలో కోదండరామ్..

టీజేఎస్ అభ్యర్థి ప్రొ. కోదండరామ్ గెలుపు ధీమాలో ఉన్నారు. పోలైన ఓట్లలో దాదాపు కోదండరాంకు మొదటి, ద్వితీయ ప్రాధాన్యతలో ఏదో ఒకటి పడినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా యువత ఎక్కువగా ఆయనవైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన కీలకపాత్ర లాంటి పరిణామాల కారణంగా యువత సానభూతి ఓట్లు సైతం కోదండరామ్‌కి పడినట్లు కొంతమంది అంచనా వేస్తున్నారు.

తమదే గెలుపు అంటున్న పల్లా..

ఇక అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు తమదే అంటున్నా.. పెరిగిన పోలింగ్ శాతం వ్యతిరేకంగానే ఓటేశారని పలువురు విశ్లేషిస్తున్నారు. పోయినసారి గెలిపించినా.. పట్టభద్రులకు ఏ ఒక్క ప్రయోజనమూ చేకూర్చలేదని, ఎవరి సమస్యలు తీర్చేందుకు ముందుకు రాలేదని, ఆస్తులు కూడబెట్టడంలో మునిగిపోయి పట్టభద్రులను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఈ సారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోలింగ్ శాతం పెరిగిదంటూ రాజకీయ నిపుణులు చెపుతున్నారు. అంతేకాదు.. పోలింగ్ కేంద్రాల్లో పలు చోట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బు పంపిణీ చేయడం, అక్కడక్కడా గొడవలు చేయడం కూడా సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోనే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా డబ్బుల పంపిణీలో కొందరికి తక్కువగా, మరికొందరికి ఎక్కువుగా ఇవ్వడంతో జరిగిన గొడవలు కూడా చాలా ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ అధికారపార్టీ అభ్యర్థికి కొంత ఇబ్బంది కలిగిచేవిగా చెపుతున్నారు కొందరు రాజకీయనాయకులు. అయితే అధికార పార్టీ అభ్యర్థి గెలుపుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమించారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధితో పల్లా గెలుపు సునాయసంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.

జయసారథికి కలిసొచ్చేనా..?

ఇక బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్, వామపక్షాల అభ్యర్థి జయసారథి, యువ తెలంగాణ నుంచి రాణి రుద్రమ, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఇంటి పార్టీ నుంచి చెరకు సుధాకర్ సైతం ఎక్కువగా ప్రభావం చూపుతారని పలువురు అంచనా వేస్తున్నారు. అధికార పార్టీని ఢీ కొట్టాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అభ్యర్థనే భావన కొంతమందిలో ఉండి అటువైపు కూడా మొగ్గు చూపారని పలువరు అభిప్రాయపడుతున్నారు. వామపక్షాల అభ్యర్థి జయసారథి సైతం గెలుపు ధీమాతో ఉన్నారు.ఇక రాణి రుద్రమకు సైతం యువతో మంచి ఫాలోయింగ్ ఉండడంతో.. ఓట్లు చీల్చడంతో యువ తెలంగాణ సైతం ముందుంటుందనే వాదన వినిపిస్తోంది. ఇక తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రభావితం చేయగలరనే అభిప్రాయం ఉంది.

Tags:    

Similar News