ఆదిలాబాద్‌లో ‘కారు’ స్పీడ్‌కు బ్రేకులు వేసిందెవరు..?

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : అధికార పార్టీలో అల్లోల ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు సొంత పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్నీ తానై నడుపుతున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రాబల్యం, ప్రాధాన్యతను అధిష్టానం వద్ద తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారా..? స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.. మంత్రి ఇలాకా నిర్మల్ నియోజకవర్గం నుంచి సారంగాపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ వేయటం […]

Update: 2021-11-27 11:11 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : అధికార పార్టీలో అల్లోల ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు సొంత పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్నీ తానై నడుపుతున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రాబల్యం, ప్రాధాన్యతను అధిష్టానం వద్ద తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారా..? స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.. మంత్రి ఇలాకా నిర్మల్ నియోజకవర్గం నుంచి సారంగాపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ వేయటం వెనక సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లు ఉన్నారనే చర్చ సాగుతోంది. మంత్రి అల్లోలకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్లు చక్రం తిప్పారని.. దీంతో ఆయన ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయాలని భావించి విఫలమయ్యారు.

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అనుభవం ఉన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీ ఛైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేయగా.. తాజాగా టీఆర్ఎస్ పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2014లో బీఎస్పీ నుంచి గెలిచి.. బీఎస్ఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేశారు. దీంతో ఆయనకు మంత్రి పదవి రాగా.. 2018లో గెలిచాక మళ్లీ మంత్రి పదవి లభించింది. దీంతో ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆయనదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఆయన సొంత నియోజక వర్గంతో పాటు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్లతో ఆయనకు దూరం పెరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. వారంతా అల్లోల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు అవకాశం కోసం చూస్తున్నట్లు తెలిసింది.

తాజాగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ అల్లోల వ్యతిరేకులంతా ఏకమైనట్లు పార్టీలో చర్చ సాగింది. నిర్మల్ నియోజక వర్గానికి చెందిన సారంగాపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ద్వారా నామినేషన్ వేయగా.. ఆయన వెనక టీఆర్ఎస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్లు ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి ముందుగా ఓ మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ను ఎమ్మెల్సీగా నామినేషన్ వేయించాలని భావించగా.. ఆయన ముందుకు రాలేదని తెలిసింది. దీంతో పత్తిరెడ్డి ద్వారా తమ ప్రణాళిక అమలు చేయాలని భావించారని అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన నాయకులు, కొందరు సీనియర్లు, ఎమ్మెల్యేలు జట్టు కట్టి కథ నడిపించారనే చర్చ తెరపైకి వచ్చింది. ఇంతలో విషయం కాస్తా పార్టీ అధినాయకత్వానికి చేరటంతో.. పార్టీ అధినాయకత్వమే ప్రత్యేకంగా రంగంలోకి సీరియస్ అయినట్లు చెబుతున్నారు.

మరోవైపు వివిధ నియోజక వర్గాల నుంచి సొంత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నామినేషన్లు వేయటం వెనక ఎవరున్నారని కూడా అధినాయకత్వం ఆరా తీసింది. పార్టీ అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించాక.. అధికార పార్టీ నుంచి నామినేషన్లు వేయటంలో సొంత పార్టీ వారే ఉన్నారనే సమాచారంతో ఎమ్మెల్యేలపై గులాబీ అధిష్టానం సీరియస్ అయింది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని వారి నామినేషన్లు ఉపసంహరించే బాధ్యత వారికే అప్పగించారు. చాలా మందిని తప్పించినా.. ప్రత్యర్థిగా ఒకరు బరిలో ఉండటం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఏకగ్రీవం కావాల్సిన సీటు.. చివరికి ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవటంతో ఎన్నిక తప్పనిసరిగా మారింది. క్యాంపు రాజకీయం నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పత్తిరెడ్డి ద్వారా ప్రణాళిక అమలు చేసిన వారెవరు.. అసలేం జరిగిందనే విషయాలను అధినాయకత్వం లోతుగా ఆరా తీస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో.. అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News