శ్రీధర్ బాబు పయనమెటు.. భట్టితో అలా జట్టుకట్టే ప్లాన్?
దిశ ప్రతినిధి, కరీంనగర్: పీసీసీ రేసులో ఉండి చివరి క్షణంలో తాను పోటీలో లేనని ప్రకటించిన శ్రీధర్ బాబు వైఖరిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తనకంటూ ప్రత్యేకంగా టీమ్ ను ఏర్పాటు చేసుకున్న శ్రీధర్ బాబు అడుగులు ఎటువైపు అన్నదే అంతుచిక్కకుండా తయారైంది ఆయన అనుచరులకు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించిన తరువాత సైలెంట్ అయిన శ్రీధర్ బాబు నిర్ణయంపైనే ఆయన అనుచరులు ఆధారపడి ఉన్నారు. దీంతో ఆయన పయనమెటు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: పీసీసీ రేసులో ఉండి చివరి క్షణంలో తాను పోటీలో లేనని ప్రకటించిన శ్రీధర్ బాబు వైఖరిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తనకంటూ ప్రత్యేకంగా టీమ్ ను ఏర్పాటు చేసుకున్న శ్రీధర్ బాబు అడుగులు ఎటువైపు అన్నదే అంతుచిక్కకుండా తయారైంది ఆయన అనుచరులకు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించిన తరువాత సైలెంట్ అయిన శ్రీధర్ బాబు నిర్ణయంపైనే ఆయన అనుచరులు ఆధారపడి ఉన్నారు. దీంతో ఆయన పయనమెటు అన్నదే మిస్టరీగా మారింది.
సొంతిటికే పరిమితం అవుతారా..?
వాస్తవంగా శ్రీధర్ బాబు పార్టీ మారాలన్న ప్రతిపాదనలు టీఆర్ఎస్ పార్టీ నుండి పలుమార్లు వచ్చాయి. 2014 ఎన్నికల తరువాత నుండి శ్రీధర్ బాబుతో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు మంతనాలు జరుపుతున్నారని, నేడో రేపో గులాబీ కండువా కప్పుకుంటారన్న ప్రచారం కూడా సాగింది. మూడు నెలల క్రితం అయితే ఆయన టీఆర్ఎస్ లో చేరితే మంత్రి పదవిని కూడా కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ముందుకు వచ్చిందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆయన మాత్రం పార్టీ ఫిరాయించే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారని భావించారంతా. కానీ తాజాగా జరిగిన పరిణామాల దృష్ట్యా ఆయన సొంతపార్టీలోనే ఉండి తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అన్నదే అంతుచిక్కకుండా పోయింది.
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రతి నాయకున్ని వ్యక్తిగతంగా వెళ్లి రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. చివరకు రేవంత్ ను బాహాటంగా వ్యతిరేకించిన విహెచ్ ఆసుపత్రిలో ఉంటే ఆయనను కూడా పరామార్శించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన పొన్నం ప్రభాకర్ ను కూడా రేవంత్ రెడ్డి కలిశారు. అయితే శ్రీధర్ బాబును కలిసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నా ఆయన స్పందించడం లేదని జిల్లాలో ఓ ప్రచారం అయితే జరుగుతోంది.
వద్దన్నా రేసులో..
తాను పీసీసీ రేసులో లేనని శ్రీదర్ బాబు ప్రకటించినప్పటికీ ఏఐసీసీ వద్దకు వెళ్లిన జాబితాలో ఆయన పేరు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, మధు యాష్కీల పేర్లు ఏఐసీసీ పెద్దలకు వెళ్లినప్పటికీ చివరి క్షణంలో అధిష్టానం మాత్రం రేవంత్ వైపే మొగ్గు చూపింది. అప్పటికీ సోనియా, రాహుల్ గాంధీలతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు ముఖ్యులు శ్రీధర్ బాబు పేరును ప్రకటించాలన్న ప్రతిపాదన చేశారని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో తాను రేసులో లేనని శ్రీధర్ బాబు స్పష్టం చేయడంతో రాష్ట్రంలో ఆయన పీసీసీ అధ్యక్షుడు అవుతాడన్న ప్రచారానికి తెరపడింది. కానీ ఏఐసీసీలోని కొంతమంది మాత్రం శ్రీధర్ బాబుకు అండగా నిలవడం గమనార్హం.
భట్టీతోనే జట్టు…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో అత్యంత సాన్నిహిత్యంగా మెదిలే శ్రీధర్ బాబు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ భట్టీతోనే జట్టు కడుతారా..? అన్న చర్చ కూడా సాగుతోంది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ తో కూడా మొదటి నుండి క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేసిన శ్రీధర్ బాబు ఇప్పుడు భట్టి విక్రమార్కతో కలిసి పనిచేస్తూ కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేక రేవంత్ నాయకత్వాన్ని స్వాగతిస్తారా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పిన శ్రీధర్ బాబు మౌనంగా ఉండడం మాత్రం అన్ని వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.