రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఓడింది

రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేశాడో అక్కడ ఇండియా కూటమి తుడుచుకుపోయిందని, ఇకనైనా బుద్ది తెచ్చుకొని వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

Update: 2024-11-24 11:30 GMT

దిశ, హుజురాబాద్ : రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేశాడో అక్కడ ఇండియా కూటమి తుడుచుకుపోయిందని, ఇకనైనా బుద్ది తెచ్చుకొని వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజలను మోసం చేసిన విషయం గమనించిన మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించారని అన్నారు.

     రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చూసిందని, ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే ఆరు గారంటీలను అమలు చేయాలన్నారు. లగిచెర్లలో ఏమీ లేదని, అక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయని ముఖ్యమంత్రి అన్నాడని, కానీ రైతులు అక్కడ పచ్చని పొలాలను చూపిస్తున్నారని పేర్కొన్నారు.

    అక్కడ పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లగిచెర్లలో పెట్టేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రీయల్ ఎస్టేట్ అని ముఖ్యమంత్రి మాట మార్చారని, మరి ఫార్మా సిటీ పేరిట ఎలా జీఓ ఇచ్చారని అన్నారు. వెంటనే జీఓ మార్చి ఇండస్ట్రీయల్ ఎస్టేట్ గా ఇవ్వాలని సూచించారు. దళితబంధు కోసం నిరసన తెలిపిన రైతులపై పెట్టిన కేసులు వెంటనే తీసివేయాలని, లేనిచో అసెంబ్లీలో పోరాటం చేస్తాం అని తెలిపారు.

    కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిందని కాంగ్రెస్ నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారని, అందులో భాగంగా ఉన్న మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్ కు నీళ్లు ఎలా తీసుకెళతారని ప్రశ్నించారు. వారం రోజుల్లో టెండర్ లు పిలవాలని ఎలా కోరతారని అన్నారు. దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితులు లేవని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.


Similar News