మంత్రి మాటల వెనక మర్మమేమిటో.. ఆ నాయకులకు సంకేతమిచ్చారా..?

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆడియోలో ఎన్నెన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆ ముఖ్య నాయకుని పయనమెటు..? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ముద్ర పడ్డ ఆ నాయకుని గురించి మంత్రి కొప్పుల చేసిన కామెంట్స్ పై అటు టీఆర్‌ఎస్ వర్గాల్లో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ తనయ కవిత ద్వారా టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పుట్ట మధు భవిష్యత్తు […]

Update: 2021-11-30 09:02 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆడియోలో ఎన్నెన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆ ముఖ్య నాయకుని పయనమెటు..? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ముద్ర పడ్డ ఆ నాయకుని గురించి మంత్రి కొప్పుల చేసిన కామెంట్స్ పై అటు టీఆర్‌ఎస్ వర్గాల్లో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ తనయ కవిత ద్వారా టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పుట్ట మధు భవిష్యత్తు ఇప్పుడు ఏంటీ అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. అధిష్టానం కూడా ఆయనకు సానుకూలంగా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

తాజాగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు వెంకటేశ్‌తో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడిన ఆడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. అందులో పుట్ట మధు ఈటల రాజేందర్ వెంట వెళ్తున్నాడని మంత్రి చేసిన కామెంట్ జిల్లాలో దుమారం రేపుతోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా కూడా ఉన్న పుట్ట మధు పార్టీలో కొనసాగడానికి ఇష్టపడడం లేదా లేక అధిష్టానమే ఆయన్ని పక్కన పెట్టిందా అన్న చర్చ సాగుతోంది.

ఈటల మార్క్..?

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభావం ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై తీవ్రంగా పడే అవకాశాలు ఉన్నాయని.. ఆయన సన్నిహితులు బీజేపీలో చేరుతారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఈటల రాజేందర్ ప్రభావంతో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పట్టు సడలించే విధంగా వ్యూహం రచిస్తున్నారని కూడా అనుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి సమీకరణాలు చేసి, చివరి సమయంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులను తనవైపు తిప్పుకుంటారని ఊహించారంతా. కానీ అనూహ్యంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృ‌ష్టిస్తున్నాయి. పుట్ట మధు ఈటల వెంట వెళ్తున్నాడని మంత్రి కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

దీంతో ఇప్పటి నుండే ఉమ్మడి జిల్లాలో పార్టీపై నైరాశ్యంలో ఉన్న నాయకులకు మార్గం సుగమం చేశారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఈటల వర్గీయులంతా కూడా ఒక తాటి పైకి వచ్చి దారి చూసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు కొందరు. ఇప్పటికే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేదన్న కారణంగా సర్దార్ రవీందర్ సింగ్ రెబల్‌గా బరిలో నిలిచి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వెంట వెళుతున్న వారు పార్టీని వీడిపోతున్నారు. తాజాగా పుట్ట మధు కూడా మంత్రి వ్యాఖ్యలతో పార్టీ ఫిరాయించేందుకు నిర్ణయించుకుంటే మంథనిలో కూడా టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు లేకపోలేదు.

అధిష్టానం ఉద్దేశ్యం అదేనా..?

మంత్రి కొప్పుల చేసిన వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చిన పుట్ట మధుపై అధిష్టానం ఉద్దేశం కూడా అదేనా అన్నదే తేలాల్సి ఉంది. ఆడియో లీకయిన తరువాత అధిష్టానం పెద్దలు ఎవరూ కూడా ఈ విషయంపై మాట్లాడడం లేదు. మంత్రి చెప్పిన విషయాన్ని అధిష్టానం ఏకీభవించినట్టేనా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. నిజంగానే అధిష్టానం ఆయనపై నమ్మకం లేకుండా ఉందా అన్న విషయంపై చర్చ సాగుతోంది. కొంతకాలంగా స్పీడ్ తగ్గించిన పుట్ట మధు పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పుడు కూడా హాజరయ్యారు.

నిర్ణయం ఏంటో..?

పుట్ట మధుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన కామెంట్స్ పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న విషయంపై గుసగుసలు నడుస్తున్నాయి. ఈశ్వర్ వ్యాఖ్యలపై పుట్ట స్పందిచనప్పటికీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతున్నదే అంతుచిక్కకుండా తయారైంది. టీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా లేక బీజేపీ వైపు అడుగులు వేస్తారా అన్న విషయంపై చర్చ సాగుతోంది.

Tags:    

Similar News