డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియా వ్యూహం ఇదే
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరంగేట్రం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇండియా, న్యూజీలాండ్ జట్లు సన్నద్దమవుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కివీస్ ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత టీమ్ ఇండియా యాజమాన్యం ప్రత్యేక వ్యూహం సిద్దం చేసినట్లు తెలుస్తున్నది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం పిచ్ గతంలో ఎలా సహకరించింది? ఎలాంటి వాతావరణంలో ఎవరికి అనుకూలంగా ఉంటుంది? అనే రికార్డులను పరిశీలించి జట్టు కూర్పును సిద్దం చేస్తున్నారు. రోజ్ బౌల్ వికెట్ […]
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరంగేట్రం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇండియా, న్యూజీలాండ్ జట్లు సన్నద్దమవుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కివీస్ ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత టీమ్ ఇండియా యాజమాన్యం ప్రత్యేక వ్యూహం సిద్దం చేసినట్లు తెలుస్తున్నది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం పిచ్ గతంలో ఎలా సహకరించింది? ఎలాంటి వాతావరణంలో ఎవరికి అనుకూలంగా ఉంటుంది? అనే రికార్డులను పరిశీలించి జట్టు కూర్పును సిద్దం చేస్తున్నారు. రోజ్ బౌల్ వికెట్ బౌలర్లకే ఎక్కువగా సహకరించే అవకాశం ఉన్నట్లు క్యూరేటర్ సైమన్ లీ కూడా వెల్లడించిన నేపథ్యంలో బలమైన బౌలింగ్ దళంతో టీమ్ ఇండియా బరిలోకి దిగనున్నది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు తుది జట్టులో ఉండేలా వ్యూహం రచిస్తున్నది. ఈ మ్యాచ్ కోసం సీనియర్లనే తీసుకునే అవకాశం ఉన్నది. చాలా రోజుల తర్వాత జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ అందుబాటులోకి రావడంతో వీరి ముగ్గురినీ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నది. ఇక స్పిన్నర్ల కోటాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు.
బౌలింగ్‌లో మార్పేమైనా ఉంటుందా?
ఇంగ్లాండ్ పరిస్థితులకు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి బౌలింగ్ సరిగ్గా సరిపోతుంది. వాళ్లు తప్పకుండా స్వింగ్, బౌన్స్ రాబట్టగలరు. అయితే మూడో పేసర్ స్థానం ఇషాంత్ శర్మకు కేటాయించాలా? లేదా సిరాజ్, శార్దుల్ ఠాకూర్‌లలో ఒకరిని తీసుకోవాలా అనే దానిపై చర్చ జరుగుతున్నది. ఆస్ట్రేలియన్ పిచ్‌లపై ఇషాంత్ శర్మ బౌలింగ్ సరిగ్గా సరిపోతుంది. అతడి ఎత్తుకు అక్కడి పిచ్‌ల వల్ల మంచి పేస్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఒకే రోజులు పలు విధాలుగా స్పందించే ఇంగ్లాండ్ పిచ్‌లపై ఇషాంత్ బదులు సిరాజ్ అయితే బాగుంటుందని కెప్టెన్ కోహ్లీ అభిప్రాయపడుతున్నాడు. గత కొన్ని నెలలుగా సిరాజ్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై అతడు ఇషాంత్ కంటే బాగా పేస్ తెప్పించగలడని అనుకుంటున్నారు. అయితే శార్దుల్ ఠాకూర్ అయితే బ్యాట్స్‌మాన్‌గా పరుగులు రాబట్టగలడని మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. మరోవైపు అశ్విన్, జడేజాలు తుది జట్టులో ఉండటం ఖాయమే. కాగా, గత కొంత కాలంగా జడేజా టెస్టు జట్టులో లేడు. అతని స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌తోరాణించినా.. బంతితో మాత్రం ఆశించిన మేర సత్తా చాటలేక పోయాడు. దీంతో అతడి విషయంలో సందిగ్దత నెలకొన్నది. టీమ్ ఇండియా యాజమాన్యానికి ఇప్పుడు అత్యంత సవాలుగా నిలిచింది బౌలింగ్ కూర్పే అని తెలుస్తున్నది.
పిచ్ గురించి చెప్పిన సైమన్ లీ..
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఎలాంటి వికెట్ రూపొందించాలో ఇప్పటికే ఐసీసీ క్యూరేటర్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. క్యూరేటర్ సైమన్ లీ పిచ్ దాదాపు పూర్తయిందని.. పేస్, బౌన్స్, స్పిన్‌కు అనుకూలించే వికెట్ రూపొందించినట్లు సైమన్ చెప్పారు. గతంలో అయితే ఇంగ్లాండ్ జట్టుకు అనుకూలంగా పిచ్‌ను రూపొందించే వాళ్లం.. కానీ ఇప్పుడు ఆడేవి తటస్థ జట్లే కాబట్టి వికెట్ రూపొందించడం సులభంగా మారిందని సైమన్ లీ అన్నారు. రోజ్ బౌల్ వికెట్ వేగం, బౌన్స్‌తో పాటు కాస్త బ్యాటింగ్‌కు క్యారీ అయ్యేలా రూపొందించాము. తొలి మూడు రోజులు పేసర్లకు, చివరి రెండు రోజులు స్పిన్నర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్ లీ చెప్పారు. రాబోయే నాలుగు రోజులు వర్షం పడకపోతే పిచ్ పూర్తిగా ఆరిపోయి గట్టిగా మారుతుంది. అప్పుడు కచ్చితంగా బౌలర్లకు సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే టీమ్ ఇండియా తొలి రెండు రోజులు బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. టీమ్ ఇండియా బలం స్పిన్నర్లే కాబట్టి.. చివరి రోజుల్లో న్యూజీలాండ్ బ్యాటింగ్ చేస్తే తమకు కలసి వస్తుందని భావిస్తున్నారు. ఏదేమైనా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టాస్ కూడా కీలకం కానున్నది. సౌతాంప్టన్‌లో చిరు జల్లులు కురిసినా, మేఘావృతమైనా పిచ్ పూర్తిగా బౌన్సీగా తయారవుతుంది. కాబట్టి బ్యాట్స్‌మెన్ ఆచితూచి బ్యాటింగ్ చేయాల్సిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీమ్ ఇండియా తుది జట్టును కోచ్, కెప్టెన్ రూపొందించనున్నారు.