గులాబీ బాస్‌కు కోపం.. టీఆర్ఎస్ గాడి తప్పుతోందా..?
అలనాటి ఉద్యమపార్టీలో క్రమశిక్షణ తప్పుతోందా..? కేసీఆర్ మాటే శిరోధార్యం అని భావించే నేతలు ఎందుకు రకరకాల కామెంట్లు చేస్తున్నారు..? కేటీఆర్ కాబోయే సీఎం అని కొందరు.. గులాబీ జెండా ఓనర్లం మేం అని ఇంకొకరు.. ‘పదవులు శాశ్వతం కాదు. ఎవడి సొత్తూ కాదు’ అని మరొకరు.. అయోధ్య రామమందిరంపై ఒకరు, రిజర్వేషన్లపై మరొకరు ఇలా రకరకాల కామెంట్లు చేయడం గులాబీ బాస్ కు కోపం తెప్పించిందా..? ఎందుకలా ఫైర అయ్యారు. పార్టీని గాడిలో పెట్టేందుకే స్వరం పెంచారా..? […]
అలనాటి ఉద్యమపార్టీలో క్రమశిక్షణ తప్పుతోందా..? కేసీఆర్ మాటే శిరోధార్యం అని భావించే నేతలు ఎందుకు రకరకాల కామెంట్లు చేస్తున్నారు..? కేటీఆర్ కాబోయే సీఎం అని కొందరు.. గులాబీ జెండా ఓనర్లం మేం అని ఇంకొకరు.. ‘పదవులు శాశ్వతం కాదు. ఎవడి సొత్తూ కాదు’ అని మరొకరు.. అయోధ్య రామమందిరంపై ఒకరు, రిజర్వేషన్లపై మరొకరు ఇలా రకరకాల కామెంట్లు చేయడం గులాబీ బాస్ కు కోపం తెప్పించిందా..? ఎందుకలా ఫైర అయ్యారు. పార్టీని గాడిలో పెట్టేందుకే స్వరం పెంచారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో : పదేళ్లపాటు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? సీఎం మార్పుపై రెండు నెలలుగా సొంత క్యాబినెట్‌లోని మంత్రులే వ్యాఖ్యానిస్తున్నా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? పార్టీ అధినేత కేసీఆర్ మాటే శిరోధార్యంగా భావించే నేతలు ఎందుకు రకరకాల కామెంట్లు చేయాల్సి వచ్చింది? పార్టీలో క్రమశిక్షణ లోపిస్తోందని సీఎం ఆందోళన చెందారా? పార్టీలో గ్రూపులు ఏర్పడుతున్నాయని ముందుగానే పసిగట్టారా? వ్యక్తులుగా వెల్లడించే అభిప్రాయాలతో పార్టీకి నష్టం వస్తోందా?.. ఇలాంటి అనేక రకాల అనుమానాలు, ఆందోళన నడుమ కేసీఆర్ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించి పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.
అసలే దూకుడు మీద ఉన్న బీజేపీకి టీఆర్ఎస్ నేతల కామెంట్లు ఆస్త్రాలుగా మారాయని కేసీఆర్ ఆందోళన చెందినట్టు సమాచారం. ‘బండకేసి కొడతా.. తాట తీస్తా.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా..’ లాంటి హెచ్చరికలు చేసేంత ఆగ్రహం కేసీఆర్‌కు ఎందుకు కలిగిందనేది టీఆర్ఎస్ నేతలకే అంతుబట్టడంలేదు. కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పజెప్పడంపై ఆయన ఎలాంటి అభిప్రాయంతో ఉన్నా మంత్రులు బహిరంగంగా కామెంట్లు చేయడం ద్వారా పార్టీకి నష్టం కలుగుతోందని భావించినట్లున్నారు. రెండు నెలల పాటు సీఎం మార్పుపై చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేసినా మౌనంగా ఉన్న కేసీఆర్ హఠాత్తుగా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటుచేసి హెచ్చరికలు జారీ చేసే వరకు ఎందుకు వెళ్లిందనేది పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు.
ఇంటెలిజెన్స్ నివేదికతో అప్రమత్తం
కేటీఆర్‌కు సీఎం పగ్గాలను అప్పజెప్తే పార్టీలో వర్గాలు, గ్రూపులు ఏర్పడతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతోనే కేసీఆర్ కఠినమైన ప్రకటన చేయాల్సి వచ్చిందని సమాచారం. ఉద్యమ నేతగా కేసీఆర్‌ను స్వంతం చేసుకున్నంతగా కేటీఆర్‌ను భావించలేరని క్షేత్రస్థాయి పరిస్థితులను పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత చాలా మంది నేతలు దూకుడుగా ఉన్న బీజేపీవైపు చూస్తున్నట్లు పార్టీకి అర్థమైంది. వారిని ఆ ప్రయత్నాల నుంచి బయటపడేయడానికి మూడు రోజుల ఢిల్లీ టూర్‌లో ప్రధానితో, అమిత్ షా తో సమావేశం కావడం ఉపయోగపడింది.
కానీ కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పజెప్తే సీనియర్లు, ఉద్యమ నాయకులు అసంతృప్తితో ఉంటారని, కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. గత కొంతకాలంగా సీఎంగా కేటీఆర్ అని వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం, సోషల్ మీడియాలో వచ్చిన సెటైర్లు, విమర్శలు, కేటీఆర్ పట్ల వెల్లడైన వ్యతిరేకత.. ఇవన్నీ కూడా కేసీఆర్ పరిగణనలోకి తీసుకుని ప్రకటన చేయడానికి కారణమయ్యాయని సమాచారం.
నేతల కామెంట్లతో తలనొప్పి
సొంత పార్టీలోని నేతలు చేస్తున్న కామెంట్లు కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించాయి. గతేడాది ఆగస్టులో ‘గులాబీ జెండా ఓనర్లం మేం’ అంటూ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల ‘పదవులు శాశ్వతం కాదు. ఎవడి సొత్తూ కాదు’ అని వ్యాఖ్యానించారు. అయోధ్య రామమందిరంపై ఒకరు, రిజర్వేషన్లపై మరొకరు, కళాకారుడిగా గుర్తింపు కోల్పోయా అంటూ ఇంకొకరు చేసిన కామెంట్లు కూడా పార్టీలో అసహజ వాతావరణాన్ని సృష్టించాయి. ఇక సొంత పార్టీలోనే బీసీ నేత, ఉద్యమ నేత లాంటి విభజనలు కూడా తలెత్తాయి.
దీనికి తోడు కేటీఆర్ సీఎం కావడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి అంటూ మంత్రులు పోటీపడి మరీ బహిరంగంగా కామెంట్లు చేయడం పార్టీలో క్రమశిక్షణ లోపిస్తోందనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం. భవిష్యత్తులో ఇది ఎలాంటి అనైక్యతకు దారితీస్తోందని కేసీఆర్ ఆందోళన చెందినట్లు తెలిసింది. పార్టీలో ఇలాంటి వాటికి చెక్ పెట్టకపోతే ఒక ప్రాంతీయ పార్టీలో ఎలాంటి పరిణామాలను చవిచూడాల్సి వస్తుందోననే ఆందోళన కూడా లేకపోలేదు. జిల్లాల్లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ తలెత్తడం, వారి మధ్య పంచాయతీకి పార్టీ జోక్యం చేసుకోవాల్సి రావడం కూడా కేసీఆర్ సీరియస్‌గానే తీసుకున్నారు.
బీజేపీని ఎదుర్కోడానికే…
‘పార్టీని నడపడం పాన్ షాపు నడిపినంత ఈజీ కాదు’ అని వ్యాఖ్యానించడం ద్వారా కేసీఆర్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. గతంలో చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ టీఆర్ఎస్‌కు ఆ పరిస్థితి రావద్దంటే క్రమశిక్షణతో పాటు పటిష్టమైన నాయకత్వం అవసరమని నొక్కిచెప్పాల్సి వచ్చింది. బీజేపీ దూకుడును అడ్డుకోవాల్సిన తరుణంలో పార్టీలో అనైక్యత, గ్రూపులు ఏర్పడడం కేసీఆర్‌ను ఆలోచనలో పడేసింది. ఒకవైపు రాజకీయ పరిస్థితులు, మరోవైపు ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలో కేటీఆర్ వాటిని ఢీకొట్టడం అంత ఈజీ కాదన్న నిర్ణయానికి వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాల్సి వచ్చిందని సమాచారం.
ఇప్పటికే వారసత్వ రాజకీయాలు, కుటుంబపాలన లాంటి విమర్శలతో తలనొప్పిగా మారిన బీజేపీకి కేటీఆర్‌ను సీఎం చేయడం ద్వారా మరో అస్త్రాన్ని అందించినట్లే అవుతుందని, దీనికి తోడు స్వంత పార్టీలోనే అసమ్మతి వస్తే వాటిని సర్దుబాటు చేయడం ఇబ్బందికరమేనని, అందుకే పరిస్థితులు అనుకూలంగా మారేంతవరకు సీఎం మార్పు వద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏక కాలంలో పాలన, పార్టీ వ్యవహరాలను చక్కదిద్దడం కేటీఆర్‌తో సాధ్యం కాదనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రతిష్ఠాత్మకంగా గెలవాల్సిన స్థానాలను బీజేపీకి చేజార్చుకోవడం ఆత్మహత్యా సదృశ్యమేనని భావించి కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని సమాచారం.