కేసీఆర్, బండి రాకపోకలు.. రాష్ట్రంలో ఏం జరుగనుంది?

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాలలో ఏం జరగబోతోంది? ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాదుకు చేరుకున్నారో లేదో బీజేపీ స్టేట్ చీఫ్ హస్తిన విమానమెక్కారు. కేసీఆర్ తో ఏకాంత భేటీలు ముగించుకున్న బీజేపీ నేతలు బండి సంజయ్‌ను పిలిపించుకుని ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. దూకుడుగా వెళ్లాలని ఇంతకాలం సూచించిన సీనియర్ నాయకులు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఒక అడుగు తగ్గమని చెప్తారా? లేక దూకుడు కొనసాగించమంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా […]

Update: 2020-12-14 02:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాలలో ఏం జరగబోతోంది? ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాదుకు చేరుకున్నారో లేదో బీజేపీ స్టేట్ చీఫ్ హస్తిన విమానమెక్కారు. కేసీఆర్ తో ఏకాంత భేటీలు ముగించుకున్న బీజేపీ నేతలు బండి సంజయ్‌ను పిలిపించుకుని ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. దూకుడుగా వెళ్లాలని ఇంతకాలం సూచించిన సీనియర్ నాయకులు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఒక అడుగు తగ్గమని చెప్తారా? లేక దూకుడు కొనసాగించమంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిజానికి కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన అనేక అనుమానాలు, ఒకింత గందరగోళాన్ని రేకెత్తించింది. ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి ఏకాంత చర్చలు జరిపిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. అదే సమయానికి బండి సంజయ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్నప్పటికీ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, పార్టీ విషయాలను కేంద్ర నాయకత్వానికి తెలియజేయనున్నారని సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడడంతో అమిత్‌ షాను కలిసి విషయాలను వివరించే అవకాశం ఉంది.

ఎందుకు రమ్మన్నారో?

కేసీఆర్, బండి సంజయ్ ఢిల్లీ పర్యటనలు ఒకదానితో ఒకటి సంబంధం లేకపోయినా, ఒకరి తరువాత ఒకరు బయలుదేరడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా రమ్మని ఆయనకు కబురు పెట్టినట్లు తెలిసింది. కేసీఆర్‌తో ఏకాంత భేటీల తర్వాత బండి సంజయ్‌ను పిలిపించుకోవడం గమనార్హం. ఇప్పటివరకూ ఉప్పు-నిప్పుగా ఉన్న ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలకు ఇప్పుడు ఢిల్లీ వేదికగా మారింది. “మాది గల్లీ పార్టీ. మాకు ప్రజలే బాస్‌లు. మేం ఎవ్వరికీ గులాములం కాము. మమ్మల్ని ఢిల్లీ శాసించలేదు” అని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అనేక రోడ్‌షోలలో గంభీరంగానే చెప్పారు.

అంత ధీమాతో ఉన్నప్పటికీ, ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు అనేక అనుమానాలు కలిగించింది. ఇప్పటికే కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ‘‘కేసీఆర్ ప్రాణం ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘యుద్ధం అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు వంగి వంగి ఎందుకు దండాలు పెట్టాల్సి వస్తోంది’’ లాంటి కామెంట్ల గురించి వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ”ఎన్నికలప్పుడు చాలా చాలా మాట్లాడుకుంటాం.. ప్రకటనలు చేస్తాం” అని టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ ఢిల్లీ పర్యటన గురించి కొత్త నిర్వచనం చెబుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల సమయంలో ‘ఫైటింగ్’ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ‘మీటింగ్’ పెట్టడంలోని ఆంతర్యం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ కుదురుతుందా? కుస్తీ పడతారా వేచి చూడాలి.

Tags:    

Similar News