‘మూడోసారి తప్పు చేయం’..రసవత్తరంగా నగరి రాజకీయం..

దిశ, రాయలసీమ : ఎంతో కష్టపడి నగరి ఎమ్మెల్యేగా రోజా గెలుపుకు కృషి చేశాం. పార్టీలో మాకు, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు తగిన స్థానం దొరుకుతుందని, న్యాయం జరుగుతుందని ఆశించాం.. న్యాయం జరగకపోగా అవమానాలు ఎదురవుతున్నాయి. అందుకే రెండుసార్లు చేసిన తప్పును మూడోసారి చేయకూడదని నిర్ణయించుకున్నాం’ అని పంచపాండవులుగా చెప్పుకునే నగరి నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల వైసీపీ అసమ్మతి నేతలు చెప్పుకొచ్చారు. నగరి పీవీకే ఫంక్షన్ హాల్‌లో ఐదు మండలాలకు చెందిన వైసీపీ అసమ్మతి నాయకులు […]

Update: 2021-12-13 20:39 GMT

దిశ, రాయలసీమ : ఎంతో కష్టపడి నగరి ఎమ్మెల్యేగా రోజా గెలుపుకు కృషి చేశాం. పార్టీలో మాకు, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు తగిన స్థానం దొరుకుతుందని, న్యాయం జరుగుతుందని ఆశించాం.. న్యాయం జరగకపోగా అవమానాలు ఎదురవుతున్నాయి. అందుకే రెండుసార్లు చేసిన తప్పును మూడోసారి చేయకూడదని నిర్ణయించుకున్నాం’ అని పంచపాండవులుగా చెప్పుకునే నగరి నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల వైసీపీ అసమ్మతి నేతలు చెప్పుకొచ్చారు.

నగరి పీవీకే ఫంక్షన్ హాల్‌లో ఐదు మండలాలకు చెందిన వైసీపీ అసమ్మతి నాయకులు సోమవారం సమావేశమయ్యారు. నగరి వైసీపీ సీనియర్ నాయకుడు కే జే కుమార్, పుత్తూరు వైసీపీ నాయకుడు ఏలుమలై, వడమాలపేట మాజీ ఎంపీపీ మురళీధర్ రెడ్డి, విజయపురం మండల వైసీపీ నాయకుడు లక్ష్మీపతి రాజు, నిండ్ర మండల పార్టీ నాయకుడు చక్రపాణి రెడ్డితోపాటు ప్రస్తుత రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ కె.జె. శాంతి కుమార్, ఎంపీటీసీ, సర్పంచ్లు ఆయా మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘అవమానాలు ఎదుర్కొంటున్నాం’

ఈ సందర్భంగా కేజే కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా రోజా గెలుపునకు ఎంతో కృషి చేసినా కార్యకర్తలకు తగిన స్థానం దక్కలేదని, పైగా అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. నిండ్ర మండల వైసీపీ నాయకుడు, శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ స్థానికులను కాదని బయటి వ్యక్తులను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు తమదైన శైలిలో మాకు బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ హైకమాండ్‌కు కట్టుబడి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా స్థానికుల్లోనే మంచి నాయకుడిని ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అందరూ కలిసికట్టుగా నడుస్తామని వివరించారు.

అనంతరం వడమాలపేట మాజీ ఎంపీపీ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ అందించినందుకు చెప్పుకోలేని అవమానాలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇకపై పార్టీకి నష్టం జరగకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సమావేశానికి వచ్చిన ఐదు మండలాలకు చెందిన నాయకులతో కలిసి పార్టీ నాయకత్వంలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

విజయపురం వైసీపీ నాయకుడు లక్ష్మీపతి రాజు మాట్లాడుతూ.. నాయకులతో కలిసి మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. పుత్తూరు వైసీపీ నాయకుడు ఏలుమలై మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఇకపై అలా జరగకుండా పార్టీకి కట్టుబడి ఉండే కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేయడానికి ఈ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు.

ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించేలా ఈ సమావేశాన్ని నిర్వహించామని పార్టీ సీనియర్ నాయకుడు కేజే కుమార్ తెలిపారు.

జిల్లాలో హాట్ టాపిక్ గా ‘నగరి మీటింగ్’

ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గానికి చెందిన 5 మండలాల వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు సమావేశం కావడం నియోజకవర్గంలో, జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. నగరిలో ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైందనే చర్చ జరుగుతోంది. జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు చేసే విషయమై చర్చించాలనే అజెండాతో నిర్వహించిన సమావేశం, మున్ముందు అధికార పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News